పాకిస్తాన్‌ పని పట్టేందుకు!

ICC  World T20  2018 Fighting with cousin in womens - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు దాయాదితో పోరు

సమరోత్సాహంతో హర్మన్‌ప్రీత్‌ సేన

పొట్టి ఫార్మాట్‌లో... అందులోనూ ప్రపంచ కప్‌లో ఎలా ఆడుతుందోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది భారత మహిళల జట్టు. పటిష్ఠమైన న్యూజిలాండ్‌ను అలవోకగా మట్టి కరిపించింది. ఇప్పుడు అదే ఊపులో పాకిస్తాన్‌ పని పట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీ ఫైనల్‌ దిశగా హర్మన్‌ప్రీత్‌ బృందం ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది.  అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్‌ జట్లు 10 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా... రెండింటిలో పాకిస్తాన్‌ విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో పాక్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే నెగ్గడం విశేషం.  

ప్రావిడెన్స్‌ (గయానా): దూకుడైన ఆటతో కివీస్‌ రెక్కలు విరిచిన హర్మన్‌ప్రీత్‌ సేన... ప్రపంచ కప్‌ స్థాయికి తగిన ప్రారంభాన్ని అందుకుంది. దీంతోపాటు కావాల్సినంత ఆత్మ విశ్వాసం కూడగట్టుకుంది. ఇక ఆదివారం రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. బలాబలాల్లో ప్రత్యర్థి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న టీమిండియాకు దాయాదిని మట్టి కరిపించడం ఏమంత కష్టమేం కాదు. అలాగని పాక్‌ను పూర్తిగా తీసిపారేయలేం. 2016 ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై భారత్‌ను ఓడించి షాకిచ్చిందా జట్టు. అప్పటిలాగా ఏమరుపాటుగా లేకుంటే టీమిండియా వరుసగా రెండో విజయాన్ని ఖాయం చేసుకోవచ్చు. 

ఆ ఒక్కటే లోటు... 
కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి... ఇలా ఒకరు కాదంటే ఒకరితో భారత బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా ఉంది. మిథాలీ క్రీజులోకి రాకుండానే భారీ స్కోరు నమోదైందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌పై శతకం బాదిన హర్మన్‌ ఇన్నింగ్స్‌ ధాటిని, జెమీమా దూకుడును చూస్తే ఎంతటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టాల్సిందే. హేమలత దయాలన్, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్, దీప్తి శర్మలతో స్పిన్‌ విభాగమూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హేమలత కివీస్‌కు కళ్లెం వేసింది.

మిగతావారూ తమవంతు పాత్ర పోషించారు. కాకపోతే, పేస్‌లోనే లోటుంది. తొలి మ్యాచ్‌ ఆడిన జట్టులో ఏకైక పేసర్‌ తెలుగమ్మాయి అరుంధతిరెడ్డి మాత్రమే. మాన్సి జోషి, పూజ వస్త్రకర్‌ పెవిలియన్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌కు మాత్రం వీరిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. విండీస్‌ పిచ్‌లు నెమ్మదిగా ఉన్నందున భారత స్పిన్‌ను ఎదుర్కొనడం పాక్‌కు సవాలే. ఆ జట్టులో కెప్టెన్‌ జవేరియా ఖాన్, వెటరన్‌ స్పిన్నర్‌ సనా మిర్, ఆల్‌రౌండర్‌ బిస్మా మరూఫ్‌లు నాణ్యమైన ఆటగాళ్లు. అయితే, స్థిరమైన ప్రదర్శన కనబర్చేవారు లేకపోవడంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top