టెస్ట్‌ క్రికెట్‌లో ‘టాస్‌’కు గుడ్‌ బై..!

ICC May Say Good Bye To Toss In test cricket - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్‌కు ఉండే విశిష్టత గురించి తెలుసు. మ్యాచ్‌లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేపట్టాలన్నది టాస్‌ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తులో టెస్ట్‌ మ్యాచ్‌లలో టాస్‌ విధానానికి మంగళం పాడాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. 1877లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. తొలుత బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏది ఎంచుకోవచ్చనేది టాస్‌ గెలిచిన కెప్టెన్‌ మీద ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా టెస్ట్‌ మ్యాచ్‌లలో టాస్‌ విధానం ద్వారా అతిథ్య జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. పిచ్‌ల ఏర్పాటు అనేది అతిథ్య జట్టు మీదే ఆధారపడి ఉండటంతో టాస్‌ గెలిస్తే పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో దేనికి అనుకూలిస్తే వారు దాన్నే ఎంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29 తేదీలలో ముంబైలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ప్రముఖ క్రికెటర్లు అనిల్‌ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేళ జయవర్దనే, రాహుల్‌ ద్రవిడ్‌, టిమ్‌ మే, న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌, థర్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌, ఐసీసీ రిఫరీలు రంజన్‌, షాన్‌ పొలాక్‌లు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. భారత్‌లో కూడా దేశవాలీ క్రికెట్‌లో టాస్‌కు స్వస్తి చెప్పే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది అమల్లోకి రాలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top