బెంగళూరు చేతిలో ఎదురైన దారుణ పరాజయం నుంచి గుజరాత్ లయన్స్ త్వరగానే కోలుకుంది. నిజానికి 20 ఓవర్ల మ్యాచ్‌లో వారు....
హర్షా భోగ్లే
బెంగళూరు చేతిలో ఎదురైన దారుణ పరాజయం నుంచి గుజరాత్ లయన్స్ త్వరగానే కోలుకుంది. నిజానికి 20 ఓవర్ల మ్యాచ్‌లో వారు 144 పరుగుల తేడాతో ఓ టెస్టు మ్యాచ్‌లాంటి ఓటమిని పొందారు. ఈ పరాభవం వారిని చాలా రోజులు వెంటాడేదే. అయినా సరైన సమయంలో తిరిగి పట్టాలెక్కారు. పాయింట్ల పట్టికలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. లయన్స్‌కు 16 పాయింట్లున్నా ప్లే ఆఫ్‌కు అధికారికంగా వెళ్లని పరిస్థితి. అయితే మరోసారి అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై గెలిచి నిశ్చింతగా ఉండాలనుకుంటోంది. అనుకోకుండా డ్వేన్ స్మిత్ బౌలింగ్ జట్టుకు వరంగా మారింది. నేటి మ్యాచ్‌లోనూ తను అదే ప్రదర్శన కనబరచాలని జట్టు ఆశిస్తే తప్పు లేదు. కానీ బ్యాటింగ్‌లోనూ అతడు కొన్ని ఓవర్లు క్రీజులో నిలిస్తే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది.
అటు ఫించ్ కూడా ప్రమాదకరంగానే కనిపిస్తున్నాడు. అంతకన్నా ముఖ్యం కెప్టెన్ సురేశ్ రైనా కీలక మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం. ఐపీఎల్ అత్యుత్తమ ఆటగాళ్లలో తనూ ఒకడు. ఈ స్టార్ ఆటగాడి గత రికార్డును పరిశీలిస్తే కోల్‌కతాపై అతడు ఆడిన ఆట ఆశ్చర్యంగా అనిపించదు. మ్యాచ్ విన్నర్‌గా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ముంబైపై కూడా ఇదే ఫామ్‌ను చూపిస్తే లయన్స్ అభిమానులకు అంతకన్నా కావాల్సిన ఆనందం ఉండదు. మరోవైపు వీరి ప్రత్యర్థి ముంబైది చావో రేవో పరిస్థితి.
అయితే ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఈ జట్టు ఎదుర్కొని అధిగమించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘనవిజయం తర్వాత ఆరు రోజుల విశ్రాంతి జట్టుకు లభించింది. అయితే అలాంటి ప్రదర్శన అనంతరం వెంటనే మరో మ్యాచ్‌కు సిద్ధం కావాలని కోరుకోవాలి. కానీ ముంబై ఇతర జట్ల ఆటను చూడాల్సి వచ్చింది. లయన్స్‌తో మ్యాచ్‌లో కృనాల్ పాండ్య కీలకం కావచ్చు. ఎందుకంటే రైనా ఇద్దరు ఎడమచేతి స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పాండ్య కూడా ఎడమచేతి బ్యాట్స్‌మనే. ఏది ఏమైనా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయనే విషయం తెలుసు కాబట్టి ముంబై వీరోచిత ప్రదర్శన చేయాల్సిందే.