
న్యూఢిల్లీ: వెటరన్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ కెరీర్ చివరి మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. ఆంధ్రతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలో దిగిన గంభీర్ (185 బంతుల్లో 112; 10 ఫోర్లు) శతకంతో ఆకట్టుకోగా... ధ్రువ్ షొరే (98; 6 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 190/1తో శనివారం ఆట కొనసాగించిన ఢిల్లీని ఆంధ్ర బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. గంభీర్ క్రితం రోజు స్కోరుకు 20 పరుగులు జతచేసి వెనుదిరగ్గా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత ధ్రువ్ తీసుకున్నాడు.
అతను జాంటీ సిద్ధూ (30), లలిత్ యాదవ్ (29), అనూజ్ రావత్ (27)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో ఢిల్లీకి స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్, మనీశ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సాయి కృష్ణకు ఓ వికెట్ దక్కింది. చేతిలో మరో 3 వికెట్లు ఉన్న ఢిల్లీ ప్రస్తుతం 19 పరుగుల ముందుంది. వశిష్ట్ (12 బ్యాటింగ్), సుభోద్ భాటి (1బ్యాటింగ్) క్రీజు లో ఉన్నారు. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు.