చెలరేగిన గౌతం గంభీర్‌

Gautam Gambhir smashes career best 151 as Delhi crush Kerala by 165 runs - Sakshi

ఢిల్లీ: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ తనలోని సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరపున టెస్టు మ్యాచ్‌ ఆడిన గౌతం గంభీర్‌.. ఆపై దేశవాళీ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. దీనిలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో గంభీర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీకి ప్రాతినిథ్య వహిస్తున్న గంభీర్‌.. కేరళతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 104 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు సాధించాడు.

గ్రూప్‌-బిలో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఉన్ముక్త్‌ చంద్‌-గౌతం గంభీర్‌లు ఆరంభించారు. ఒకవైపు ఉన్ముక్త్‌ చంద్‌ కుదరుగా బ్యాటింగ్‌ చేస్తే, గంభీర్‌ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాడు. కేరళ బౌలర్లలో ఓ ఆటడుకుంటూ తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గంభీర్‌.. అటు తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌ 172 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన గంభీర్‌.. రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. మిగతా ఢిల్లీ ఆటగాళ్లలో ఉన‍్ముక్త్‌ చంద్‌(69), ధృవ్‌ షోరే(99 నాటౌట్‌), విజయ్రన్‌(48 నాటౌట్‌)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ ఎనిమిది వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఢిల్లీ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top