భారత జట్టులోకి సైనీ.. డీడీసీఏకి గంభీర్‌ చురకలు

Gambhir takes on DDCA after Saini selected indian teams - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టుకు నవదీప్ సైనీ ఎంపికైన వేళ మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్‌‌లకు వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ చురకలు అంటించాడు. బయటి వాడనే కారణంతో సైనీని ఢిల్లీ జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుపడేందుకు గతంలో వీరిద్దరూ ప్రయత్నించారు. అయితే సైనీకి తొలిసారి భారత జట్టులోకి పిలుపు అందిన వేళ.. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌(డీడీసీఏ)కి చెందిన కొందరు సభ్యులతోపాటు బేడీ, చౌహాన్‌లకు గంభీర్ ‘సంతాపం’ ప్రకటించాడు. మహ్మద్‌ షమీ ఫిట్‌నెస్ నిరూపించుకో లేకపోవడంతో అప్ఘాన్‌తో టెస్టుకి నవదీప్ సైనీని సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

‘నలుపు రంగు చేతి బ్యాండ్లు బెంగళూరులోనూ దొరుకుతాయి. రూ.225 పెడితే ఓ రోల్ వస్తుంది. సర్, ముందుగా నవదీప్ భారతీయుడని గుర్తుంచుకోండి. అతడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడనేది తర్వాతి సంగతి’ అంటూ గంభీర్ మాజీలకు చురకలు అంటించాడు.

2013లో గంభీర్ ప్రోద్భలంతో నవదీప్ సైనీ తొలిసారి ఢిల్లీ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఢిల్లీ జట్టులో సైనీని చేర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ బేడీ డీడీసీఏ ప్రెసిడెంట్ అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కర్నాల్‌ (హరియాణా)కు చెందిన నవదీప్‌ను ఢిల్లీ జట్టులోకి ఎలా తీసుకుంటారు? గత ఏడాది కాలంలో అతడు ఢిల్లీ తరపున క్రికెట్ ఆడలేదు. బయటి వ్యక్తిని జట్టులోకి తీసుకోవడం సరైంది కాదు. ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం కోసం చాలా మంది కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారంటూ.. సైనీ ఎంపిక పట్ల బేడీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

గంభీర్ చొరవతో సైనీని ఢిల్లీకి ఎంపిక చేయడం పట్ల డీడీసీఏ అధికారులు తీవ్రంగా అసహనానికి లోనయ్యారు. ఈ రచ్చ మొత్తం ఇప్పటికీ మర్చిపోని గంభీర్ ట్వీట్ ద్వారా వారికి చురకలు అంటించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top