సిరీస్‌... నేడు గెలుస్తారా? ఆఖరి దాకా రానిస్తారా? 

Fourth ODI today in Mohali - Sakshi

మొహాలిలో నేడు నాలుగో వన్డే

సిరీస్‌ సమంపై ఆసీస్‌ కన్ను

వశం చేసుకోవాలనుకుంటున్న భారత్‌

ధోని స్థానంలో రిషభ్‌ పంత్‌

రోహిత్, ధావన్‌లకు పరీక్ష

వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో నేడు నాలుగో మ్యాచ్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఇక్కడే సిరీస్‌ను గెలుపుతో ముగిస్తారా లేక ఆఖరిదాకా తీసుకొస్తారా అనేది నేటి మ్యాచ్‌ ఫలితంతో తేలుతుంది. కోహ్లి సూపర్‌ ఫామ్‌లో ఉండగా... అతనికి అండగా నిలిచేవారూ, బాగా ఆడేవారు కరువయ్యారు. ఆ ఒక్కడిపైనే భారం వేయకుండా బాధ్యతగా అందరూ ఆడితేనే జట్టు సమష్టితత్వంతో గెలుస్తుంది. లేదంటే ఆసీస్‌ సిరీస్‌ను సమం చేయడం గ్యారెంటీ!  

మొహాలి: భారత్‌ ఇక్కడ గెలవాలన్నా... ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్నా... టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడాలి. అప్పుడే ప్రపంచకప్‌ సన్నాహాన్ని విజయంతో ముగించగలం. అలా కాదని ఏ ఒక్కరి మీదో ఆధారపడితే మళ్లీ చేదు ఫలితం... ఆఖరిదాకా (ఐదో వన్డే) పోరాటం... ఈ రెండూ తప్పవు. ఈ సిరీస్‌లో గెలుపు రుచి చూసిన ఆస్ట్రేలియా ఇప్పుడు సమంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నాలుగో వన్డే రసవత్తర పోరుకు తెరతీస్తుందేమో చూడాలి. ఆస్ట్రేలియా గత మ్యాచ్‌ విజయంతో టచ్‌లోకి వచ్చింది. భారత్‌ బలగాన్ని  దెబ్బ తీసింది. భారత బలం కూడా అర్థమైపోయింది. ధోని దూరమైన బృందంలో ఒకే ఒక్కడి (కోహ్లి) వికెట్‌తో మళ్లీ మ్యాచ్‌ గెలవొచ్చని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. 

సూపర్‌ ఫామ్‌లో కోహ్లి... 
భారత సారథి కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌ను మజా చేసుకుంటున్నాడు. సెంచరీలతో పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడే మ్యాచ్‌లాడిన కెప్టెన్‌ మూడొందలకు (283 పరుగులు) చేరువయ్యాడు. ఇందులో రెండు సెంచరీలుండటం విశేషం. అతను ఐదునెలల క్రితమే (అక్టోబర్‌)లో 10 వేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆడింది 12 మ్యాచ్‌లే... కానీ స్కోరేమో 10, 816కు చేరింది. ఇంతగా ఎవరికీ సాధ్యంకానీ నిలకడతో, ఎవరికీ సాధ్యంకానీ ఆటను అతను ఆడుతున్నాడు. కానీ సహచరులే టీమిండియా కొంపముంచుతున్నారు. గత మ్యాచ్‌లో ఏ ఒక్కరైనా ఫిఫ్టీ చేసినా, లేదంటే ఏ ఇద్దరు 30 చొప్పున పరుగులు చేసినా భారతే గెలిచేది. కానీ ఎవరూ ఆ బాధ్యత తీసుకోలేదు. కనీసం పీకలమీదికి (ఐదో వన్డే దాకా) రాకముందే ఈ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లు తమ వంతు సహకారాన్ని కెప్టెన్‌కు అందించాలి. కలిసికట్టుగా కంగారూ పనిపట్టాలి. ప్రపంచకప్‌ దగ్గరవుతున్న కొద్దీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌కు దూరమవుతుండటం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. రోహిత్‌ ప్రదర్శన అతని కంటే మెరుగే కానీ గొప్పగా ఏమీ లేదు. 51 పరుగులే చేయగలిగాడు.  తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు (33 పరుగులు) ఇచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. ఇప్పుడైనా అతను కళ్లు తెరవాలి. బ్యాట్‌కు పనిచెప్పాలి. లేదంటే ప్రపంచకప్‌ సంగతేమో గానీ... ఐదో వన్డేకే బెర్తు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కోహ్లి జట్టులో మార్పులుంటాయని కరాఖండీగా చెప్పేశాడు. 

రిషభ్, భువీ వచ్చేశారు 
రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ ధోని విశ్రాంతి తీసుకోవడం రిషభ్‌ పంత్‌కు కలిసొచ్చింది. అతన్ని తుది జట్టులోకి తెచ్చింది. ధోని ఉండగా కేవలం బ్యాట్స్‌మన్‌గా పనికొచ్చే పంత్‌కు ఇప్పుడు కీపర్‌గానూ నైపుణ్యం చాటుకునే అవకాశాన్ని ఈ రెండు వన్డేలు ఇస్తున్నాయి. ఇది అతని ప్రపంచకప్‌ పయనాన్ని కచ్చితంగా నిర్ణయిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కూడా ఫైనల్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు. దీంతో షమీ, బుమ్రాలలో ఒకరికే చాన్స్‌ దక్కొచ్చు. బహుశా భువీ–బుమ్రా కాంబినేషన్‌కే జట్టు యాజమాన్యం సై అనే అవకాశముంది. స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌వైపు జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గడంతో రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. కుల్దీప్‌కు జతయిన చహల్‌ రాణిస్తే ఆస్ట్రేలియాను స్పిన్‌తో దెబ్బకొట్టొచ్చు. అప్పుడే సిరీస్‌కు గెలుపుతో తెరదించవచ్చు.  

ఆత్మవిశ్వాసంతో  ఆస్ట్రేలియా... 
మూడో వన్డేలో సాధించిన సాధికార విజయం ఆస్ట్రేలియాను సిరీస్‌ వేటలోకి తెచ్చింది. రాంచీ మ్యాచ్‌లో కంగారూ జట్టు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొట్టింది. వీళ్ల టాపార్డరేమో భారీగా పరుగులు చేసింది. ప్రత్యర్థి టాపార్డర్‌ను నిలువునా కూల్చేసింది. కోహ్లి గనక ఆడకపోతే భారత్‌కు భారీ పరాభవం ఖాయమయ్యేది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖాజా, ఫించ్‌ ఫామ్‌లోకి వచ్చారు. మిడిలార్డర్‌లో స్టోయినిస్‌ నిలకడగా రాణిస్తుంటే గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ మెరుపులు మెరిపించాడు. హ్యాండ్స్‌కోంబ్‌ గత మ్యాచ్‌లో డకౌటైనా... రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. టెయిలెండర్లలో క్యారీ జట్టుకు ఉపయుక్తమైన స్కోర్లు చేస్తున్నాడు. బౌలింగ్‌లో ఆడమ్‌ జంపా తన స్పిన్‌ మాయాజాలంతో టీమిండియా వెన్నెముకను విరిచేస్తున్నాడు. కీలక వికెట్లను చేజిక్కించుకోవడం ద్వారా అతను భారత బ్యాట్స్‌మెన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. పేసర్లలో కమిన్స్, రిచర్డ్‌సన్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు.  

ఆస్ట్రేలియాతో మొహాలిలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోవడం గమనార్హం. 1996లో టైటాన్‌ కప్‌లో భాగంగా ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచిన భారత్‌... 2006, 2009, 2013లలో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మొహాలిలో భారత్‌ ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడింది. 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడింది.   

జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, రాయుడు, రిషభ్‌ పంత్, కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, భువనేశ్వర్, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా/షమీ. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖాజా, షాన్‌ మార్‌‡్ష, మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, లయన్, రిచర్డ్సన్, జంపా. 

పిచ్, వాతావరణం  
ఫ్లాట్‌ వికెట్‌ ఇది. దీంతో ఇక్కడ బ్యాట్స్‌మెన్‌ పరుగుల పండగ చేసుకోవచ్చు. వర్షం ముప్పేమీ లేదు. మ్యాచ్‌కు అడ్డంకీ లేదు. కానీ మంచు ప్రభావం ఉంటుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top