
కిటో (ఈక్వెడార్): వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అన్నీ తానై ‘హ్యాట్రిక్’ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించా డు. ఈక్వెడార్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో విజయం సాధించి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొదలైన 38 సెకన్లకే ఇబర్రా చేసిన గోల్‌తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది.
అయితే మెస్సీ తన మ్యాజిక్‌తో 11వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 18వ, 62వ నిమిషంలో మెస్సీ మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్‌ను అందించాడు. అర్జెంటీనాతోపాటు కొలంబి యా, ఉరుగ్వే, పనామా జట్లు... యూరోప్ జోన్ నుంచి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నెదర్లాండ్స్, చిలీ, పరాగ్వే, అమెరికా జట్లు విఫలమయ్యాయి.