వయసు దాటినవారు 51 మంది...

Fifty One Athletes Found Overaged In National Inter District Junior Athletics Meet  - Sakshi

జాతీయ అండర్‌–14 అథ్లెటిక్స్‌ మీట్‌లో ఘటన  

తిరుపతి: క్రీడల్లో తప్పుడు వయోధ్రువీకరణ పత్రాలతో తక్కువ వయసు స్థాయి పోటీల్లో పాల్గొనడటం తరచుగా జరుగుతూనే ఉంది. ఇలాంటిదే ఇటీవల జరిగిన ఒక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తిరుపతి వేదికగా నవంబర్‌ 24 నుంచి 26 మధ్య వరకు జరిగిన జాతీయ జూనియర్‌ అంతర్‌ జిల్లా అథ్లెటిక్స్‌ మీట్‌లో ఇది చోటు చేసుకుంది. అండర్‌–14, అండర్‌–16 విభాగాల్లో పోటీ పడటానికి దేశవ్యాప్తంగా 494 జిల్లాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు ఈ మీట్‌లో పాల్గొన్నారు. అయితే వీరి వయసును తెలుసుకోవడానికి భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వారికి వయసు నిర్ధారిత పరీక్షలు నిర్వహించింది.

ఇందులో భాగంగా అథ్లెట్లకు దంత పరీక్షలు, టానర్‌ వైట్‌హౌస్‌  (టీడబ్ల్యూ3– ఎక్స్‌రే ద్వారా ఎముక వయసును కనుగొనే పద్ధతి) పరీక్షలు నిర్వహించగా... అందులో 51 మందికి ఎక్కువ వయసు ఉన్నట్లు తేలింది. వీరంతా  తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో పోటీల్లో పాల్గొంటున్నట్లు ఏఎఫ్‌ఐ కనిపెట్టింది. మరో 169 మంది పరీక్షల్లో పాల్గొనకుండా ముందే తప్పించుకున్నట్లు ఏఎఫ్‌ఐ వయసు నిర్ధారిత పరీక్షల నిర్వహణాధికారి రాజీవ్‌ ఖత్రి తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రా ల వివరణను కోరనున్నట్లు ఏఎఫ్‌ఐ స్పష్టం చేసింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వేదికగా జరిగిన జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ లో కూడా దాదాపు 100 మంది ప్లేయర్లు తప్పుడు వయసుతో పోటీల్లో పాల్గొంటూ పట్టుబడ్డారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top