అట్టహాసంగా ఫిఫా ప్రారంభ వేడుకలు

FIFA World Cup 2018 Opening Ceremony - Sakshi

మాస్కో: సాకర్‌ సమరానికి తెర లేచింది. ఫుట్‌బాల్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న 21వ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ గురువారం రాత్రి ఆరంభమైంది. దాదాపు 88 ఏళ్ల చరిత్ర కలిగిన పుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ మహా సంగ్రామం అంగరంగ వైభవంగా రష్యాలో ప్రారంభమైంది. స్థానిక లుజ్నికి మైదానంలో నిర్వహించిన ఆరంభోత్సవం కనుల విందు చేసింది. రష్యా దేశ చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు, కళాకారుల పాటలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా అదరహో అనిపించాయి.

దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అతిరథ మహారథులు, అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. బ్రిటిష్‌ పాప్‌ స్టార్‌ రాబీ విలియమ్సన్‌, రష్యన్‌ గాయని ఐదా గార్ఫులినా బృందం మ్యూజికల్‌ షో అభిమానులను అలరించింది. దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్‌లు, ట్రాంపోలినిస్ట్‌ల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సమాంతరంగా మాస్కో నగరంలోని ప్రఖ్యాత రెడ్‌ స్క్వేర్‌లో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ఫీఫా ప్రపంచ కప్‌ పోటీలు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరంభ​ మ్యాచ్‌లో రష్యా, సౌదీ అరేబియా జట్లు తలపడుతున్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top