ఫెడరర్‌... మళ్లీ నంబర్‌వన్‌

Federer back as No. 1 - Sakshi

మాడ్రిడ్‌ ఓపెన్‌లో నాదల్‌ పరాజయంతో అవకాశం

రోమ్‌ ఓపెన్‌లో స్పెయిన్‌ స్టార్‌ గెలిస్తే మళ్లీ టాప్‌ ర్యాంక్‌లోకి

పారిస్‌: రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. గతవారం మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాఫెల్‌ నాదల్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో నాదల్‌ ఓడిపోయాడు. దాంతో అతని పాయింట్లలో కోత పడింది. మరోవైపు గత ఏడాది మాదిరిగా ఈసారీ ఫెడరర్‌ క్లే కోర్టు సీజన్‌లో ఆడటం లేదు. ఫలితంగా ఫెడరర్‌ అదనంగా పాయింట్లు కోల్పోయే అవకాశం లేదు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్‌ 8,670 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా... గత వారం వరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న నాదల్‌ 7,950 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

ఈ వారంలో రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌లో గనుక నాదల్‌ విజేతగా నిలిస్తే మళ్లీ నంబర్‌వన్‌ అవుతాడు. 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్న ఫెడరర్‌ 2008 ఆగస్టు 17 వరకు ఆ స్థానంలో కొనసాగాడు. కొంతకాలంపాటు నాదల్, జొకోవిచ్‌లకు టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన అనంతరం ఫెడరర్‌ 2009 జూలై 6 నుంచి 2010 జూన్‌ 6 వరకు మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్‌ 4 వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. ఆ తర్వాత నాదల్, జొకోవిచ్‌ ధాటికి వెనుకబడిపోయిన ఫెడరర్‌ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గి ఫిబ్ర వరిలో ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టాప్‌ ర్యాంక్‌ అందుకున్న పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top