
లండన్: తమ దేశ క్రికెట్‌లో ఏమాత్రం అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అవినీతి నిరోధక నిబంధనలను మరింత కఠినం చేస్తూ మరింత పారదర్శకత క్రికెట్‌ను అభిమానులకు అందించేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా దేశవాళీ క్రికెట్‌లో స్మార్ట్ వాచ్‌లను నిషేధించింది. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో స్మార్ట్ వాచ్‌లు వాడకూడదని ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లు ఉపయోగించడం వలన సమాచార మార్పిడి జరిగే అవకాశం ఉండటంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ఈసీబీ పరిధిలో జరిగే ప్రతి ప్రత్యక్ష ప్రసారం జరిగే మ్యాచ్‌ల్లో ఈ నిషేధం ఉంటున్నట్లు తెలిపింది. అయితే లైవ్ టెలీకాస్ట్ కానీ మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్ రూమ్, డగౌట్‌లలో ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించవచ్చని పేర్కొంది. కౌంటీ చాంపియన్ షిప్-2019లో భాగంగా మైదానంలో ఉండగానే స్మార్ట్ వాచ్‌తో తాను ఇంగ్లండ్‌కు ఎంపికైన విషయం తెలిసిందని లాంక్‌షైర్ స్పిన్నర్ పార్కిన్సన్ పేర్కొన్నాడు. దీంతో అన్ని ప్రధాన మ్యాచ్‌ల్లో స్మార్ట్ వాచ్‌లను ఈసీబీ నిషేధించగా.. తాజాగా అన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు పొడిగించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో స్మార్ట్ వాచ్‌ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే.