డ్రింక్స్‌ బ్రేక్‌లో శుభవార్త!

At drinks break, Siddarth Kaul gets biggest career newsbreak - Sakshi

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్, సర్వీసెస్‌ మధ్య మ్యాచ్‌... వేదిక అమృత్‌సర్‌లోని గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌. డ్రింక్స్‌ బ్రేక్‌లో రిఫరీ సూచన మేరకు అంపైర్‌ పంజాబ్‌ జట్టులోని ఓ ఆటగాడిని పిలిచి ఏదో సమాచారమిచ్చాడు. అంతటితో ఆ క్రికెటర్‌ ఆనందానికి అవధుల్లేవు. అతనే పంజాబ్‌ పేస్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌. భారత వన్డే జట్టులో కౌల్‌ ఎంపికైన విషయం ఫీల్డ్‌ అంపైర్‌ ద్వారానే అతనికి తెలిసింది. టీమిండియాలో చోటు కోసం కౌల్‌ నిరీక్షణ సుదీర్ఘ కాలంగా కొనసాగింది. కోహ్లి నాయకత్వంలో 2008 అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కౌల్‌ కూడా సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయానికి దక్షిణాఫ్రికా చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా... కౌల్‌ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును విజేతగా నిలిపాడు. 

కోహ్లి స్టార్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి కెప్టెన్‌గా మారినా... నాటి జట్టులోని జడేజా ప్రస్తుతం కీలక ఆటగాడిగా ఎదగడంతో పాటు అభినవ్‌ ముకుంద్, సౌరభ్‌ తివారీ వంటి వారు ఇప్పటికే భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా... సిద్ధార్థ్‌ కౌల్‌కు మాత్రం జాతీయ సీనియర్‌ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. అయినా నమ్మకం కోల్పోకుండా దేశవాళీలో స్థిరమైన ప్రతిభతో రాణిస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్లకు కౌల్‌కు భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్‌ ఆడుతుండగానే శ్రీలంకతో వన్డేలకు ఎంపికైనట్లు తెలిసిందని... గ్రౌండ్‌లో ఉండగానే ఇంత గొప్ప వార్త వినడాన్ని జీవితంలో మరిచిపోలేనని కౌల్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో యువరాజ్, హర్భజన్‌ సింగ్‌ల సలహాలతో మరింత రాటుదేలానని సిద్ధార్థ్‌ పేర్కొన్నాడు. ఆలస్యంగానైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top