ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్‌కతా జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
‘షూటౌట్’ సెమీస్‌లో గోవాపై గెలుపు
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్‌కతా జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సహయజమానిగా ఉన్న గోవా ఎఫ్‌సీ జట్టుతో బుధవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో కోల్‌కతా ‘పెనాల్టీ షూటౌట్’లో 4-2 తేడాతో గెలిచింది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి అంచె సెమీఫైనల్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండో మ్యాచ్ కీలకమైంది. అయితే నిర్ణీత సమయం, ఆ తర్వాత అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ఈనెల 20న జరిగే ఫైనల్లో సచిన్ టెండూల్కర్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ జట్టుతో కోల్‌కతా పోటీపడుతుంది.