ఆయుష్‌ బృందానికి రజతం 

Bronze for Garcha in world shooting championship - Sakshi

 ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌

చాంగ్‌వన్‌ (దక్షిణ కొరియా): హైదరాబాద్‌ యువ షూటర్‌ ఆయుష్‌ రుద్రరాజు ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ జూనియర్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించాడు. మంగళవారం జరిగిన జూనియర్‌ పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో ఆయుష్‌ రుద్రరాజు (119 పాయింట్లు), గుర్‌నిహాల్‌ సింగ్‌ గర్చా (119), నరూక అనంత్‌జీత్‌ సింగ్‌ (117)లతో కూడిన భారత బృందం 355 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో గుర్‌నిహాల్‌ సింగ్‌ 46 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. క్వాలిఫయింగ్‌లో గుర్‌నిహాల్, ఆయుష్‌ 119 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. అయితే ఆరో బెర్త్‌ కోసం వీరిద్దరి మధ్య షూట్‌ ఆఫ్‌ నిర్వహించారు. గుర్‌నిహాల్‌ మూడు పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత పొందగా... ఆయుష్‌ రెండు పాయింట్లే స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. టీమ్‌ విభాగంలో చెక్‌ రిపబ్లిక్‌ (356 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... ఇటలీ జట్టు (354 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది.  

మరోవైపు సీనియర్‌ మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌ షూటర్‌ రష్మీ రాథోడ్‌ (108), మహేశ్వరి చౌహాన్‌ (106), గనెమత్‌ సెఖాన్‌ (105)లతో కూడిన భారత జట్టు 319 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మరో మూడు రోజుల్లో ముగియనున్న ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు భారత్‌ 7 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top