వాళ్లే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌: లారా

Brian Lara Says Kohli And Root Are Best Batsmen In The World  - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి నిలుస్తాడని వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ 2019 ప్రచారంలో భాగంగా న్యూయార్క్‌లో వున్న లారా పలు విషయాలు క్రికెట్‌ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే తను కోహ్లి, ఇంగ్లండ్‌ టెస్టు సారథి జోయ్‌ రూట్‌లకే ఓటు వేస్తానని స్పష్టంచేశాడు. ఇంగ్లండ్‌-టీమిండియాల మధ్య జరగుతున్న సిరీస్‌లో వీరిద్దరూ పోటిపడి పరుగులు చేస్తున్నారని కొనియాడాడు. ఇక 29 ఏళ్ల టీమిండియా సారథి పరుగుల సునామీ తగ్గటం లేదన్నాడు. గత పర్యటను చేదు అనుభవాలను చెరిపివేస్తూ ప్రస్తుత సిరీస్‌లో అదరగొడుతూ ఇప్పటికే 544 పరుగులు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. టెస్టుల్లో తాను ఎందుకు నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మనో ప్రపంచానికి కోహ్లి చాటి చెప్పాడని వివరించాడు. 

వార్న్‌, ముత్తయ్య భయపెట్టారు
ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌, శ్రీలంక స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీథరన్‌ బౌలింగ్‌లో తాను ఇబ్బందులకు గురైన మాట వాస్తవమేనని లారా అంగీకరించాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో వీరిద్దరి బౌలింగ్‌ తనను భయపెట్టిందన్నాడు. పక్కా ప్రణాళికతో వారి బౌలింగ్‌ను ఎదుర్కొడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించాడు. అంతర్జాతీయ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400*) సాధించిన లారా స్పిన్‌ దిగ్గజాల(వార్న్‌, ముత్తయ్య)కు భయపడ్డానని చెప్పడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒలంపిక్స్‌లో క్రికెట్‌ ఉండాలి
మూడు గంటల ఆటైన టీ20 క్రికెట్‌ని ఒలంపిక్స్‌లో ప్రవేశపెట్టాలని బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. అత్యంత ప్రజాధరణ కలిగిన క్రికెట్‌ ఒలంపిక్స్‌లో లేకపోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుందన్నాడు. అతి త్వరలోనే ఒలంపిక్స్‌లో క్రికెట్‌ ఉండాలని ఆశిద్దామని పేర్కొన్నాడు. నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలనుకునే దేశాలు మాత్రమే లాంగ్‌ ఫార్మట్‌ క్రికెట్‌ను ప్రోత్సహిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా లారా వివరించాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top