బౌల్ట్‌ వెనుక పడ్డ లంక క్రికెటర్లు!

Boults Hilarious Reaction After Ball Gets Trapped In Helmet - Sakshi

గాలే: న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గురువారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ట్రెంట్‌ బౌల్ట్‌ ఆడిన  ఓ బంతి ఎడ్జ్‌ తీసుకున్న తర్వాత హెల్మెట్‌లో ఇరుక్కుపోవడం అక్కడ నవ్వులు పూయించింది. లంక స్పిన్నర్‌ లసిత్ ఎమ్బుదినియా వేసిన 82వ ఓవర్‌లో  ఇది చోటు చేసుకుంది. బౌల్ట్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోగా అది ఎడ్జ్‌ తీసుకున్న వెంటనే హెల్మెట్‌లో ఇరుక్కుపోయింది.

ఒకవేళ ఆ బంతి కింద పడే సమయంలో లంక ఫీల్డర్లు క్యాచ్‌ పడితే బౌల్ట్‌ అవుటయ్యేవాడు. కాకపోతే ఆ బంతి హెల్మెట్‌ గ్రిల్‌లోపల అలానే ఉండిపోవడంతో లంక క్రికెటర్లు.. బౌల్ట్‌ వెనుక పడ్డారు. ఆ క్రమంలోనే కాసేపు లంక ఫీల్డర్లను బౌల్ట్‌ ఆట పట్టించాడు. దాంతో లంక క్రికెటర్లతో పాటు బౌల్ట్‌ కూడా పడిపడి నవ్వుకున్నాడు. అది జరిగిన కాసేపటికి బౌల్ట్‌ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది.  203/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్వల్ప వ్యవధిలోనే ఎంతో సేపు నిలవలేదు.కేవలం 46 పరుగులే జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. తొలి సెషన్‌లో లంక పేసర్‌ లక్మల్‌ (4/29) విజృంభించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top