
బాలచంద్ర మరో సంచలనం
సొంతగడ్డపై జరుగుతోన్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ మరో సంచలన విజయం నమోదు చేశాడు.
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతోన్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ మరో సంచలన విజయం నమోదు చేశాడు. ఇక్కడి కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఏడో రౌండ్‌లో బాలచంద్ర ప్రసాద్ సెర్బియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రాజిక్ సినిసాను ఓడించాడు. ఈ టోర్నీలో జీఎం హోదా ఉన్న క్రీడాకారుడిని ఓడించడం బాలచంద్రకిది రెండోసారి కావడం విశేషం.
తొలి రౌండ్‌లో భారత జీఎం విష్ణు ప్రసన్నపై నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ కుర్రాడు మరో ఇద్దరు జీఎంలు నీలోత్పల్ దాస్, దీపన్ చక్రవర్తిలతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత బాలచంద్ర ప్రసాద్ ఐదు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎం లలిత్ బాబు నాలుగో విజయం సాధించాడు. శార్దూల్ గగారే (భారత్)తో జరిగిన గేమ్‌లో నెగ్గిన లలిత్ ఐదు పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు.
తమిళనాడుకు చెందిన జీఎం ఎస్.పి.సేతురామన్ ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి వెళ్లాడు. టాప్ సీడ్ ఇవాన్ పొపోవ్ (రష్యా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను సేతురామన్ ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత రాష్ట్రానికే చెందిన హర్ష భరత్‌కోటి 29వ ర్యాంక్‌లో, రవితేజ 56వ ర్యాంక్‌లో, కార్తీక్, సీఆర్‌జీ కృష్ణ వరుసగా 67వ, 68వ ర్యాంకుల్లో, దీప్తాంశ్ రెడ్డి 72వ ర్యాంక్‌లో, వైవీకే చక్రవర్తి 76వ ర్యాంక్‌లో ఉన్నారు.