
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్ అమిత్ పంఘాల్‌ను ‘అర్జున’ అవార్డు కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నామినేట్ చేసింది. ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించాడు.
దీంతో అతన్ని క్రీడాపురస్కారానికి నామినేట్ చేసినట్లు బీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్, గౌరవ్ బిధూరిలను నామినేట్ చేశారు. 22 ఏళ్ల అమిత్ తన నామినేషన్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా పేరు నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు.