చిలీపై అర్జెంటీనా పైచేయి | Argentina vs. Chile - Football Match Report - June 6, 2016 | Sakshi
Sakshi News home page

చిలీపై అర్జెంటీనా పైచేయి

Jun 7 2016 11:06 PM | Updated on Sep 4 2017 1:55 AM

చిలీపై అర్జెంటీనా పైచేయి

చిలీపై అర్జెంటీనా పైచేయి

గాయం కారణంగా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందుబాటులో లేకున్నా... అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో...

* డిఫెండింగ్ చాంపియన్‌పై నెగ్గిన నంబర్‌వన్ జట్టు
* మెస్సీ లేకున్నా రాణించిన నిరుటి రన్నరప్
* కోపా అమెరికా కప్

సాంటా క్లారా (అమెరికా): గాయం కారణంగా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందుబాటులో లేకున్నా... అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

దీంతో గతేడాది జరిగిన ‘కోపా’ ఫైనల్లో చిలీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. అర్జెంటీనా తరఫున 51వ నిమిషంలో ఏంజెల్ డిమారియా, 59వ నిమిషంలో ఎవర్ బనెగా ఒక్కో గోల్ చేయగా... చిలీ జట్టుకు 93వ నిమిషంలో (ఇంజ్యూరీ టైమ్) జోస్ పెడ్రో ఫ్యుయెన్‌జలీదా ఏకైక గోల్ అందించాడు.
 
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న అర్జెంటీనా... ఐదో ర్యాంక్‌లో ఉన్న చిలీ జట్టు తొలి అర్ధభాగంలో ఆద్యంతం దూకుడుగా ఆడినా ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకే అర్జెంటీనా ఖాతాలో తొలి గోల్ చేరింది. మిడ్ ఫీల్డ్ నుంచి బనెగా ముందుకు వచ్చి తన ఎడమ వైపు ఉన్న డిమారియాకు పాస్ ఇవ్వగా... అతను బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఎనిమిది నిమిషాల తర్వాత అర్జెంటీనా రెండో గోల్‌ను సాధించింది.

ఈసారి డిమారియా ఇచ్చిన పాస్‌ను బనెగా లక్ష్యానికి చేర్చాడు. రెండు గోల్స్ చేసిన తర్వాత కూడా అర్జెంటీనా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరి నిమిషాల్లో చిలీకి జోస్ పెడ్రో గోల్ అందించినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్‌కు ఓటమి తప్పలేదు.
 పనామా గెలుపు: ‘డి’ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పనామా జట్టు 2-1తో బొలీవి యాను ఓడించింది. పనామా తరఫున బ్లాస్ పెరెజ్ (11వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... బొలీవియాకు కార్లోస్ గోల్ అందించాడు.
 
బాధలో ఉన్నా...
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన డిమారియాకు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు చేదు వార్త తెలిసింది. తనెంతగానో అభిమానించే అమ్మమ్మ మరణించిందని సమాచారం అందడంతో అతను తీవ్ర వేదనతోనే బరిలోకి దిగాడు. గోల్ చేసిన వెంటనే ‘గ్రాండ్‌మా... ఐ విల్ మిస్ యు సో మచ్’ అని రాసిన టీ షర్ట్‌ను ప్రదర్శించి డిమారియా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘అమ్మమ్మ మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఆడాలనుకున్నాను. నేను జాతీయ జట్టుకు ఆడినందుకు ఆమె ఎంతో గర్వపడింది’ అని డిమారియా మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement