శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బ లాంటి జవాబు | amitabh bahcchan slams shobha de for comments on indian players | Sakshi
Sakshi News home page

శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బ లాంటి జవాబు

Aug 19 2016 3:00 PM | Updated on Sep 4 2017 9:58 AM

శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బ లాంటి జవాబు

శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బ లాంటి జవాబు

పీవీ సింధును రచయిత్రి శోభా డే 'సిల్వర్ ప్రిన్సెస్' అనడంతో ఆమెపై ట్విట్టర్‌లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

మన క్రీడాకారులకు పతకాలు రానంతసేపు వాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే రియో వెళ్లారని ఎద్దేవా చేసిన శోభా డే.. ఆ తర్వాత కూడా తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై సెమీఫైనల్స్‌లో నెగ్గి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ పోరుకు సిద్ధమైన తెలుగు షట్లర్ పీవీ సింధు విషయంలో కూడా ఆమె ఇష్టారాజ్యంగా కామెంట్ చేయడంతో ట్విట్టర్ జనాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సింధును 'సిల్వర్ ప్రిన్సెస్' అంటూ ఆమె కామెంట్ పెట్టడంతో ఇక మీరు మారేది లేదా అంటూ ట్విట్టర్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం నుంచి మీరు దూరంగా ఉండాలని కొందరు సుతిమెత్తగా చెబితే మరికొందరు కాస్తంత గట్టిగానే స్పందించారు.

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే శోభా డే అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు. 'శోభా దే' రహాహై అన్నారు. ఇక బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్‌కు కూడా శోభా డే పట్ల చాలా కోపం వచ్చింది. అయితే ఆయన ఆమె పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలచుకుంది చెప్పేశారు.

''మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్ తీసుకుని వస్తున్నారు.. మేం మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాం'' అని పీవీ సింధును ఉద్దేశిస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు మీరు అతిగా వాగేవాళ్ల నోరు మూయించారని మరో ట్వీట్ చేశారు. పనులే మాట్లాడతాయని, అవి కూడా అప్పుడప్పుడు 'పెన్ను'ను ఓడిస్తాయని ఆయన అన్నారు. మనవాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే అక్కడకు వెళ్తున్నారన్న రచయిత్రి శోభా కామెంట్లను గుర్తుచేస్తూ అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement