ఫైనల్‌ పంచ్‌కు ఆరుగురు

Amit Panghal And Kavinder Singh Bisht among six Indians to reach finals - Sakshi

సెమీస్‌లో మెరిసిన భారత బాక్సర్లు

నిఖత్‌ జరీన్‌తో కలిíపి మరో ఏడుగురికి కాంస్య పతకాలు

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌): ‘రింగ్‌’లో మరోసారి తమ పంచ్‌ పవర్‌ చాటుకొని ఏకంగా ఆరుగురు భారత బాక్సర్లు ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతక పోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో అమిత్‌ పంఘల్‌ (52 కేజీలు), కవిందర్‌ సింగ్‌ బిష్త్‌ (56 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), దీపక్‌ సింగ్‌ (49 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సోనియా చహల్‌ (57 కేజీలు), మనీషా మౌన్‌ (54 కేజీలు)... పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) సెమీఫైనల్లో పరాజయంపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం ఫైనల్స్‌ జరుగుతాయి. గురువారం జరిగిన పురుషుల విభాగం సెమీఫైనల్స్‌లో గత ఏడాది ఆసియా క్రీడల చాంపియన్‌ అమిత్‌ 4–1తో జియాంగున్‌ హు (చైనా)పై, కవిందర్‌ 4–1తో ఎంఖ్‌ అమర్‌ ఖర్‌ఖు (మంగోలియా)పై, ఆశిష్‌ కుమార్‌ 3–2తో మౌసవీ సెయెద్‌షాహిన్‌ (ఇరాన్‌)పై గెలుపొందగా... దీపక్‌కు తన ప్రత్యర్థి తెమిర్తాస్‌ జుసుపోవ్‌ (కజకిస్తాన్‌) నుంచి వాకోవర్‌ లభించింది.

మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో పూజా రాణి 5–0తో ఫరీజా షోల్టే (కజకిస్తాన్‌)పై, సిమ్రన్‌జిత్‌ కౌర్‌ 5–0తో మలియెవా మఫ్తునాఖోన్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించారు.  ఇతర సెమీఫైనల్స్‌లో నిఖత్‌ జరీన్‌ 0–5తో ఎన్గుయెన్‌ థి తామ్‌ (వియత్నాం) చేతిలో... సరితా దేవి 0–5తో వెన్‌లు యాంగ్‌ (చైనా) చేతిలో... మనీషా 2–3తో హువాంగ్‌ సియావో వెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... సోనియా చహల్‌ 2–3తో నిలావన్‌ టెక్‌సుయెప్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో; శివ థాపా 1–4తో జకీర్‌ సఫిలిన్‌ (కజకిస్తాన్‌) చేతిలో, ఆశిష్‌ 0–5తో బోబో ఉస్మాన్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమి చవిచూశారు. గాయం కారణంగా సతీశ్‌ కుమార్‌ బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థి కమ్‌షెయ్‌బెక్‌ (కజకిస్తాన్‌)కు వాకోవర్‌ ఇచ్చాడు. ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో 37 ఏళ్ల సరితా దేవికిది ఎనిమిదో పతకం కావడం విశేషం. ఆమె 2001లో రజతం, 2017లో కాంస్యం, 2003, 2005, 2008, 2010, 2012లలో స్వర్ణాలు గెలిచింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top