నీకు పీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వలేదా?: అక్తర్‌

Akhtar Jokes About Misbah ul Haqs Appointment - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా, దేశవాళీ క్రికెట్‌ జట్ల హెడ్‌ కోచ్‌లకు చీఫ్‌ సెలక్టర్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ను నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు ప్రధాన బాధ్యతలను మిస్బావుల్‌ హక్‌కు అప్పజెప్పడంపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ తనదైన శైలిలో చమత్కరించాడు. ‘కేవలం రెండు కీలక పదవులే నీకు అప్పచెప్పారు. ఇంకా నయం పీసీబీ చైర్మన్‌గా కూడా నిన్నే నియమించలేదు’ అంటూ సెటైర్‌ వేశాడు.

ఇది తాను తమాషాకే మాత్రమే అంటున్నానని, మిస్బావుల్‌కు కీలక బాధ్యతలు ఇవ్వడం తనకేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదన్నాడు. వీటికి మిస్బావుల్‌కు అర్హత ఉందని కొనియాడాడు.  ‘ కంగ్రాట్స్‌ మిస్బావుల్‌. రెండు కొత్త బాధ్యతల్లో నీ మార్కు ఉంటుందనే అనుకుంటున్నా. అతను క్రికెట్‌ ఆడుతున్న సమయంలో జట్టుకు ఎంతటి ఘన విజయాలు అందించాడో, అదే తరహాలో కోచ్‌గా కూడా రాణించాలి. ఇక చీఫ్‌ సెలక్టర్‌గా కూడా మిస్బా తనదైన ముద్ర వేస్తాడనే అనుకుంటున్నా. కాకపోతే పీసీబీ చైర్మన్‌గా మిస్బాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది(నవ్వుతూ)’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. అయితే పీసీబీ చైర్మన్‌గా ఎంపిక చేయలేదనేది కేవలం సరదాగా వ్యాఖ్యానించానని అక్తర్‌ వివరణ ఇచ్చాడు.

మూడేళ్ల పాటు మిస్బావుల్‌ హక్‌ను పాక్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించగా, మూడు ఫార్మాట్లకు అతనే కోచ్‌గా ఉంటాడని బుధవారం పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్‌ దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఆరు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అసోసియేన్లలో ప్రధాన కోచ్‌లగా ఉన్న వారికే కూడా చీఫ్‌గా మిస్బానే వ్యవహరిస్తాడని తెలిపింది. ఇక బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌ను ఎంపిక చేసింది. గతంలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌కు బౌలింగ్‌ యూనిట్‌ బాధ్యతల్ని కేటాయించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top