వహ్వా... అఖిల్‌

Akhil Sheoran wins gold in 50m rifle, 4th for India at Guadalajara ISSF World Cup - Sakshi

ప్రపంచకప్‌ షూటింగ్‌లో పసిడి పతకం

రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో అగ్రస్థానం

గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత గన్‌ మళ్లీ గర్జించింది. నాలుగో స్వర్ణంతో మెరిసింది. పురుషుల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో మేటి షూటర్లు బరిలో ఉండగా... కెరీర్‌లో కేవలం రెండో ప్రపంచకప్‌ ఆడుతోన్న 22 ఏళ్ల అఖిల్‌ షెరాన్‌ అద్భుతమే చేశాడు. ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడుతూ అందర్నీ బోల్తా కొట్టించి ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువ షూటర్‌ గురికి భారత్‌ ఖాతాలో నాలుగో పసిడి పతకం వచ్చి పడింది.

అఖిల్‌తోపాటు భారత్‌కే చెందిన సంజీవ్‌ రాజ్‌పుత్, స్వప్నిల్‌ కుసాలే ఫైనల్‌కు చేరారు. అఖిల్‌ 455.6 పాయింట్లతో విజేతగా నిలువగా... బెర్నాడ్‌ పికిల్‌ (ఆస్ట్రియా–452 పాయింట్లు) రజతం, ఇస్త్‌వాన్‌ పెని (హంగేరి–442.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. 430.9 పాయింట్లతో సంజీవ్‌ రాజ్‌పుత్‌ నాలుగో స్థానంలో... 407.2 పాయింట్లో స్వప్నిల్‌ ఆరో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కిది తొమ్మిదో పతకం. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.

అంతర్జాతీయ షూటింగ్‌లో 38 పతకాలు గెలిచిన హంగేరి దిగ్గజం పీటర్‌ సిడి, రియో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత అలెక్సిక్‌ రెనాల్డ్‌ (ఫ్రాన్స్‌), ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి పతకం నెగ్గిన ఇస్త్‌వాన్‌ పెని (హంగేరి)లాంటి మేటి షూటర్లు బరిలో ఉండగా... అఖిల్‌ సంయమనంతో షూట్‌ చేసి అనుకున్న ఫలితం సాధించాడు. క్వాలిఫయింగ్‌లో త్రీ పొజిషన్స్‌ (మోకాళ్లపై కూర్చోని, ముందుకు వాలి, నిలబడి)లో భాగంగా షూటర్లు ఒక్కో విభాగంలో 40 చొప్పున షాట్‌లు సంధించారు.

1174 పాయింట్లతో అఖిల్‌ నాలుగో స్థానంలో, 1176 పాయింట్లతో రాజ్‌పుత్‌ రెండో స్థానంలో, 1168 పాయింట్లతో స్వప్నిల్‌ ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మందితో కూడిన ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్‌ చివరిదాకా నిలకడగా పాయింట్లు స్కోరు చేశాడు. చివరి షాట్‌లో అఖిల్‌ అత్యుత్తమంగా 10.8 స్కోరు చేయడం విశేషం. మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో మను భాకర్‌ ఐదో స్థానంలో నిలిచింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top