
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న దెయ్యం ఫొటో
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ : ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయ విద్యార్థులను దెయ్యం భయం వెంటాడుతోంది. దీంతో కొద్ది రోజులుగా కొందరు విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. నార్త్ బెంగాల్ యూనివర్సిటీ సాల్ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది.
ఆంత్రోపాలజీ డిపార్ట్‌మెంట్‌కు అతి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంత్రంలో దెయ్యం సంచరిస్తోందనే పుకార్లు మొదలయ్యాయి. కొందరు విద్యార్థులు తాము దెయ్యాన్ని చూశామని, ఆ సందర్భంగా తీసిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో కలకలం రేగింది.
రాత్రి వేళల్లో ఆ ప్రాంతానికి చేరువలోని ఇళ్ల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో విద్యార్థుల భయం మరింత పెరిగింది. దీంతో పలువురు ఆంత్రోపాలజీ విద్యార్థులు తరగతులకు హాజరుకావడం మానేశారు. దెయ్యం ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది. దెయ్యం ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించిన యూనివర్శిటీ యాజమాన్యం అది నకిలీదని పేర్కొంది.