సిద్దిపేట నా కుటుంబం

siddipet is my family irrigation minister t harish rao - Sakshi

మీ ప్రేమతో ఇంతటి వాడినయ్యా...

ఇండస్ట్రియల్‌ హబ్‌గా సిద్దిపేట

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట ‌: నేను ఎక్కడ ఉన్న నా ధ్యాసంతా సిద్దిపేట ప్రజలపైనే, నా కుటుంబం సిద్దిపేటనే. నేను, సీఎం కేసీఆర్‌లు మీరు పెంచిన బిడ్డలం. మీ ప్రేమతోనే నేను ఇంతటి వాడినయ్యాను. నా కుటుంబాన్ని ఎలా చుసుకుంటున్నానో అలాగే సిద్దిపేట ప్రజలపై కూడా ప్రేమ ఉంది. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం రాత్రి శివమ్స్‌ గార్డెన్‌లో జరిగిన శివాజీనగర్‌ వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటను బంగారు తునకగా మార్చడానికి కేసీఆర్‌ మూడు హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా సాధించుకున్నామని మరో రెండు హామీలు గోదావరి జలాలు, రైల్వేలైన్‌ త్వరలో రానుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్ల పనులను వేగవంతం చేస్తున్నామని త్వరలో గోదావరి జలాలతో జిల్లా బీడు భూములన్ని సస్యశ్యామలంగా మారి మహర్దశ పట్టనుందన్నారు.

రాబోయే రోజుల్లో సిద్దిపేట ప్రాంతం ఒక రిజర్వాయర్‌గా, ఒక ఇండస్ట్రీయల్‌ హాబ్‌గా, ఒక పర్యాటక ప్రాంతంగా ఆవిర్భావం కానుందన్నారు. ఈ అభివృద్దిలో ఇంకా మీ సహకారం, భాగస్వామ్యం కావాలని మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. సిద్దిపేట వైశ్య భవన్‌ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలువనుందన్నారు. సిద్దిపేట వైశ్యులతో సీఎంకు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. అన్ని సంఘాలు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రం, దేశం అంతా సిద్దిపేట వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. విద్యా, వైద్యరంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్త శర్మ, వైశ్య సంఘం ప్రతినిధులు కొమురవెల్లి చందు, వేణు, గంప మహేందర్‌రావు, గంప శ్రీనివాస్, సిద్ధయ్య, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top