రౌడీయిజంపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

రౌడీయిజంపై ఉక్కుపాదం

Published Wed, Apr 10 2019 7:25 PM

YSRCP Srikakulam MLA Candidate Dharmana Prasada Rao Fires On Gunda Laxmi Devi - Sakshi

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న గుండ లక్ష్మిదేవికి అభివృద్ధి చేయడం చేతకాక.. ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక.. తనపై అభాండాలు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం నియోజజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. తనకు రౌడీయిజం అంటగడుతున్నారని.. నగరంలో ఎక్కడైనా తన పేరుతో రౌడీయిజం, అరాచకం చేస్తే ఉక్కుపాదంతో తొక్కేస్తానన్నారు. శ్రీకాకుళం నగరంలో ఓ ప్రవేటు హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎక్కడైనా తన పేరుతో రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నట్టు తెలిస్తే 9959865756 నంబరుకు ఫోన్‌ చేసి తనకు తెలపాలని కోరారు.

ఎమ్మెల్యేగా ఎంపికైన గుండ లక్ష్మిదేవి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం, రింగ్‌రోడ్డు, స్టేడియం నిర్మాణాలను పూర్తిచేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో నిరుపేదల ఇళ్ళ నిర్మాణం కోసం రెండెకరాల స్ధలం సేకరించి ఉంచితే ఆ స్ధలం కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మించడం దారుణమన్నారు. ఆధ్యత్మిక కార్యకలాపాలు జరిపించేందుకు టీటీడి కళ్యాణమండపం నిర్మాణానికి రూ.8 కోట్లు నిధులిస్తే కనీసం ఒక్క ఇటుక కూడా వేసుకోలేకపోయిన అసమర్ధురాలన్నారు. హుదహుద్‌ సమయంలో గూడు కోల్పోయిన వారి కోసం 192 ఇళ్ళు నిర్మిస్తే వాటన్నింటికి టీడీపీ జన్మభూమి కమిటీలకు, కార్యకర్తలకు లక్షలాది రూపాయిలు కమీషన్లు దండుకుని అనర్హులకి అప్పగించారన్నారు. నిరుపేదల కోసం ఇళ్ళు నిర్మాణమనిచెప్పి అర్బన్‌ హౌసింగ్‌లో ఒక్కో అడుక్కి రూ.3 వేలు కట్టించుకోవడం సరికా దన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆ డబ్బులు చెల్లించనక్కర్లేదని చెప్పారని గుర్తుచేశారు. 

టీడీపీ నాయకులు ఏమి చేశారని ఓటడుగుతారు?
రాష్ట్ర విభజన అనంతరం వెనుకబడిన జిల్లాలకు తగిన ఫండ్స్‌ రాలేదు...విభజన హామీలు తుంగలో తొక్కేశారు....వెనుకబడ్డ జిల్లాకు రావాల్సిన కేంద్ర సంస్ధలు ఏర్పాటు చేయలేదు.. ఇన్ని చేశాకా టీడీపికి ఓటెయ్యాలా అని ప్రశ్నించారు. హోదాను తాకట్టుపెట్టడం వల్ల పరిశ్రమలు రాక అభివృద్ధి ఎక్కడివేసిన గొంగళిలా ఉండిపోయిందన్నారు. జిల్లాకు చెందిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు ముందు ఒక్క మాటాడలేరు...జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పధకాలు అడగలేరని ఎద్దేవా చేశారు. మత్య్సకారులకు తొక్కతీస్తానని, నాయీ బ్రాహ్మణులకు తోక కత్తిరిస్తానని అవమానించింది చంద్రబాబు కాదా అన్నారు.  

Advertisement
Advertisement