‘ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు’

YSRCP MP Candidate Kanumuri Raghuram krishnam Raju Fire On Janasena In Palakollu - Sakshi

సాక్షి, పాలకొల్లు: ప్రజలు నుంచి ఊహించిన దానికంటే అనూహ్యమైన స్పందన వస్తోందని, ఒకప్పుడు టీడీపీకి వెన్నుముఖలా ఉండే బీసీలు ఇప్పుడు తమ పార్టీకి అండగా ఉన్నారని నర్సాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాలకొల్లు ప​ట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983లో ఎన్టీ రామారావు ఎటువంటి ప్రభంజనంతో గెలిచారో ఇప్పుడు అన్ని కులాల సహకారంతో అటువంటి ప్రభంజనంతో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పాలకొల్లులో ఒక పెద్దాయన టామి అనే సినిమా తీశారని, ఆ కుక్క ఆయన్నుకరచినట్లు ఉంది.. అందుకే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని సీనియర్‌ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్యను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తన తాత సిరీస్‌ రాజు పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమన్నారు.

వంగవీటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మా తాతే
వంగవీటి రంగాను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తన తాత సిరీస్‌ సుబ్బరాజు అని తెలిపారు. వంగవీటి మోహన్‌రంగా తనకు అత్యంత ఆప్తులు అని చెప్పారు. చంద్రబాబు నాయుడే, వంగవీటి రంగాని చంపించారని హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 1989లో జరిగిన హత్య ఉదంతాన్ని 2019 ఎన్నికల్లో తన మీద వాడుకోవడం చూస్తే జాలేస్తుందని అన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్నానని, కండువాలు మార్చానని నాగబాబు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నాగబాబు ముందు ప్రజారాజ్యంలో లేరా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయలేదా అని సూటిగా అడిగారు. జనసేన పార్టీ నాగబాబు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పెట్టారని, అది ఇప్పుడు రెండు కండువాలతో కలసిందని విమర్శించారు.

2014లో మోదీ, చంద్రబాబు పార్టీలతో కలిశారు.. మళ్లీ బయటకు వచ్చి ఇప్పుడు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో కలిశారు. నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎన్ని కండువాలు వేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. హరిరామ జోగయ్య టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ ఇలా అన్ని పార్టీల్లో చేరి తీరా సీటు రాకపోవడంతో ఇప్పుడు జనసేన పార్టీలో చేరింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. హరిరామ జోగయ్య 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఏ మాత్రం సంబంధం లేని తమపై రుద్ది నిందలు వేయడం సరికాదన్నారు. అన్న నాగబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. నాగబాబుకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top