పులిహోర తింటే పులి అయిపోరు: రోజా

YSRCP MLA Roja Lashes Out At Chandrababu Naidu In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ‘ఎన్ని కష్టాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా,  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ ఆయన నెరవేర్చుతున్నారు. అలాం‍టివారిని పులి అంటారు కానీ... పులిహోర బ్యాచ్‌ను పులి అనరు’  అని ఆమె వ్యాఖ్యానించారు.

మద్యపాన నిషేధంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...‘ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు అవుతుంది. నారావారి  సారా పాలన నుంచి విముక్తి లభించింది. చంద్రబాబు హయాంలో సరైన వర్షాలు పడలేదు. కృష్ణానదికి ఏనాడు వరద రాలేదు. రాష్ట్రంలో మాత్రం మద్యం ఏరులై పారింది. చంద్రబాబుది విజన్‌ 2020 కాదు...విజన్‌ 420. గత అయిదేళ్లలో రూ.75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మరి చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదు. మద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. అన్నిటీకి అనర్థం మద్యమే. గత అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. ’ అని మండిపడ్డారు.  

చదవండి: ఇంత దారుణమా చంద్రబాబూ..!

ఆరు నెలల్లోనే దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. 43వేల బెల్ట్‌ షాపులను తొలగించి, 40 శాతం బార్లు కూడా తగ్గించారు. గతంలో ఉన్న నాలుగువేలకు పైగా పర్మిట్‌ రూమ్‌లను తొలగించారు. ఇచ్చిన మాటను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇన్నాళ్లు చరిత్రను విన్నాం, చదివాం. మొట్టమొదటిసారిగా సీఎం జగన్‌ పాలనలో చరిత్రను రాయడం చూస్తున్నాం. 

మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి మహిళా అభినందిస్తుంది. సీఎం జగన్‌ దేశంలో లేనివిధంగా పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంటి యజమాని మద్యానికి బానిస అయితే ఆ ఇల్లు నరకమే. మద్యపాన నిషేధం అమలుపై... ఆదాయం కోల్పోతామని, అమలు చేయలేమని, మగవాళ్లు ఓట్లు వేయరంటూ చాలామంది మాట్లాడారు. అయితే  ఆదాయం కాదు ...ఆడవాళ్ల సౌభాగ్యం ముఖ్యమని సీఎం జగన్‌ మద్యపాన నిషేధంపై కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

అన్ని అనర్థాలకు మద్యమే కారణం: భూమన
అంతకు ముందు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ...అన్ని అనర్థాలకు మద్యమే కారణమని అన్నారు. జీవితాలను సర్వనాశనం చేసేది మద్యమే అని, మనుషులను మృగాలుగా మార్చే మహమ్మరి మద్యం అన్నారు. చంద్రబాబు హయంలో మద్యం విక్రయాలు పెరిగాయన్న భూమన మద్యం మానవ మనుగడకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top