అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ఆఖరిపోరాటం

YSRCP Leaders Support to the Agrigold victims - Sakshi

అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీ విస్తృతస్థాయి భేటీలో కీలక నిర్ణయాలు

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా మూడంచెల పోరాటం 

22, 23 తేదీల్లో మండల కేంద్రాల్లో దీక్షలు

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా ఆఖరిపోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు నిర్ణయించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన పోరాటానికి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీ, బాధితులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మూడండెల పోరాటం చేయాలని నిర్ణయించారు. బాధితులకు చివరి రూపాయి అందేవరకూ పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తుందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అండగా ఉంటారని నేతలు చెప్పారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడారు. బొత్స మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలోను, బయట అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అనేక పర్యాయలు డిమాండ్‌ చేసినట్టు గుర్తుచేశారు.  

చంద్రబాబు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. వాటాలు తేలకే అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ నుంచి ఎస్సెల్‌ గ్రూపు తప్పుకొందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే జగన్‌ సీఎం కాగానే బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై కేంద్ర సంస్థలతో సమగ్ర విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్‌ రూ.3,250 కోట్ల స్కామ్‌ను సీబీఐ విచారణ జరిపించిన కేంద్రం.. దానికి రెండింతలు పెద్దదైన అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు పూర్తి న్యాయం జరిగాక అగ్రిగోల్డ్‌ భూములు కొట్టేసిన పెద్దల పాత్రపై సీబీఐ విచారణ కోరతామని సుబ్బారెడ్డి ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒక మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రాష్ట్రంలో టీడీపీ పాలన అద్దం పడుతోందన్నారు.

అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో పని పూర్తి చేయవచ్చన్నారు. జగన్‌ సీఎం అయ్యాక బాధితులకు నిధులు విడుదల చేసి ఆదుకుంటామన్నారు. బాధితులెవరు అధైర్యపడొద్దని, చివరి రూపాయి వచ్చే వరకు జగన్‌ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మండల స్థాయి నుంచి బాధితుల జాబితాను తయారు చేయాలని కమిటీకి సూచించారు. బాధితులకు తెలిసిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలను కమిటీకి తెలియజేస్తే వాటిని చంద్రబాబు సర్కార్‌ మింగేయకుండా కాపాడుకుందామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను చంద్రబాబు సర్కార్‌ తక్కువ చేసి చూపడం వెనుక కుట్ర ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ..  అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, పార్టీ నేతలు బొప్పన భవకుమార్, అడపా శేషు, శ్యామ్, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పోరాటం...
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా మూడంచెల పోరాటం చేయాలని బాధిత బాసట కమిటీ సమావేశం నిర్ణయించింది. సమావేశం నిర్ణయాలను బాసట కమిటీ కో ఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు, ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో బాధితులతో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లోనే సభలు ఏర్పాటు చేసి చర్చించి మూడో దశ ఉద్యమాన్ని తీవ్రరూపంలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. బాధితులకు వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా ఉన్నారనే భరోసా ఇవ్వడం ద్వారా బాధితుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని సమావేశం సూచించింది.

సీఎం హడావుడి సమీక్ష 
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం కోరుతూ వైఎస్సార్‌ సీపీ పోరాటాన్ని ముమ్మరం చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ సమస్యలపై అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ఈ కేసులో వాస్తవస్థితి నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌కు  సూచించారు. కొన్ని శక్తులు బాధితుల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి లేవదీయడానికి కుటిలయత్నాలు చేస్తున్నాయని కోర్టుకు చెప్పాలన్నారు. 

ప్రభుత్వం దగా చేసింది
అగ్రిగోల్డ్‌ సమస్యపై మాట మార్చి రాష్ట్ర ప్రభుత్వం బాధితులను దగా చేస్తోంది. మొదట్లో అగ్రిగోల్డ్‌ అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ అని భయపెడుతున్నారు. దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని రూ.7 వేల కోట్లు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదు. 
– రంగారెడ్డి, ఆలిండియా అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, ఖాతాదారుల వెల్ఫేర్‌ సంఘం 

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితురాలు మృతి
రామసముద్రం: అగ్రిగోల్డ్‌ బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెంబకూరు గ్రామానికి చెందిన అబ్దుల్‌ రషీద్‌ కష్టపడి సంపాదించిన సొమ్ము అగ్రిగోల్డ్‌లో జమ చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో రషీద్‌ భార్య దిల్‌షాద్‌ (58) తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో శనివారం రాత్రి దిల్‌షాద్‌ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top