2,500 కంటే ఎక్కువ జనాభా ఉంటే ప్రతి సచివాలయ పరిధి ఒక ప్రత్యేక యూనిట్
వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంలో ఇకపై జనాభా ఆధారిత యూనిట్ విధానం అనుసరించాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ వార్డు, కార్పొరేషన్ డివిజన్, పంచాయతీ పరిధిలో 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సందర్భాల్లో ఆ పరిధిలోని ప్రతి సచివాలయ పరిధిని ఒక ప్రత్యేక యూనిట్‌గా తీసుకోవాలని.. ఆ యూనిట్‌కు ఒక కోర్ కమిటీ, ఏడు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటుచేయాలని ఆయన చెప్పారు.
వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులతో బుధవారం సజ్జల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో పార్టీ సంస్థాగత బలాన్ని కిందిస్థాయిలో మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలకు స్పష్టమైన బాధ్యతలు, మెరుగైన సమన్వయం కల్పించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు.
పార్టీ టెక్నికల్ టీం అవసరమైన మ్యాపింగ్, డిజిటల్ సపోర్ట్ అందిస్తూ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ యూనిట్ విధానం పట్టణ ప్రాంతాలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలకు వర్తిస్తుందని సజ్జల చెప్పారు.
పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25లోగా కమిటీల నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఉగాది రోజు పార్టీ కేడర్‌కు ఐడీ కార్డులు అందించే ఆలోచనలో ఉన్నందున నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.


