జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన : బొత్స

YSRCP Garjana Deeksha On June 2nd says Botsa Satyanarayana - Sakshi

     వైఎస్సార్‌ సీపీ నేత బొత్స వెల్లడి

     ప్రజలను పస్తులు పెట్టి మహానాడు పేరుతో పండుగా?

     టీడీపీకి ఇదే ఆఖరు మహానాడు

     తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి చంద్రబాబూ...!

     17 మందితో చక్రం తిప్పలేనోడికి 25 మంది ఎంపీలు అవసరమా!   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్షను చేపట్టనుందని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ వైఎస్సార్‌సీపీ పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే కాక, పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 30న విశాఖలో వంచనపై గర్జనను నిర్వహించామని, జూన్‌Œ 2న నెల్లూరులో దీక్ష నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. దీక్షలో రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారన్నారు. నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు.# చంద్రబాబుకు అధికార పూర్వకంగా నిర్వహించే ఆఖరు మహానాడు ఇదే అవుతుందని, మహానాడు పేరుతో ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను పస్తులుంచి మహానాడు పేరుతో టీడీపీ నేతలు పిండివంటలు తింటూ పండగ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. 

ఐదు సంతకాలు... అమలైందెక్కడ?
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాల్లో వేటినీ నెరవేర్చలేదన్నారు. బెల్ట్‌ షాపుల రద్దుకు రెండో సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో వాటిని రద్దు చేశారా? ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో రూ.2కే ఇస్తానన్న 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఏమైందన్నారు. ఇక తొలి సంతకంతో ప్రకటించిన రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ పరిస్థితి ఏమిటో తెలిసిందేనన్నారు?  రాష్ట్రంలో 25 మంది ఎంపీలనిస్తే చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబు 2014లో 17 మందిని ఇస్తే ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు అంతకు ముందు ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. టీటీడీలో అవతకవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ చేయటం మానేసి ఇష్టమొచ్చినట్లు తూలనాడటం, ఉద్యోగాలు తీసేస్తామని అనటం ఎంత వరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెడతామని తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటిస్తే ఉలికిపాటు ఎందుకని బొత్స ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top