చంద్రబాబు లాంటి సీఎం అవసరమా: వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma Speech In Chandragiri Public Meeting - Sakshi

తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరుకు ఇంతవరకు ఏమీ చేయలేదని,  చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయలేదు..సొంత జిల్లానే అభివృద్ధి చేయలేని ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చంద్రగిరిలో వైఎస్‌ విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా లక్షలాది మందికి పునర్జన్మ లభించిందని గుర్తు చేశారు. ప్రజల కష్టాలు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ దగ్గర నుంచి చూశారని, అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా తీరుస్తాడని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో 650 హామీలిచ్చి చంద్రబాబు నాయుడు మోసం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీకైనా సరిపోలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపించే సరికి అన్నదాత-సుఖీభవ అంటూ చంద్రబాబు మళ్లీ మోసానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ పేరుతో ఎన్నికలు వచ్చేసరికి అక్కచెల్లెళ్లను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

బాబు వస్తే జాబు అన్నారు.. ఏమైంది
బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్నారు.. ఏమైంది... ఉన్న ఉద్యోగాలనే పీకేయించాడని ఆరోపించారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.47 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు నాలుగు దఫాల్లో పూర్తిగా మాఫీ చేస్తారని ప్రకటించారు. బాబు పాలనలో చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను మూసేశారని, వాటిని వైఎస్‌ అధికారంలోకి రాగానే తెరిపించారు..చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ అవి మూతపడ్డాయని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. మన్నవరం ప్రాజెక్టు రూ.6 వేల కోట్లతో ఏర్పాటు కావాల్సింది.. తమిళనాడుకు తరలిపోయింది.. ఇది చంద్రబాబు అసమర్థత కాదా అని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మా మద్ధతు
ప్రత్యేక హోదా ఇచ్చే వారికే వైఎస్సార్‌సీపీ మద్ధతు ఇస్తుందని వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 25 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో మనం చక్రం తిప్పగలుగుతామని చెప్పారు. మాట మాట్లాడితే తెలంగాణా సీఎం కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌కు లింకు పెట్టి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ సింగిల్‌గా పోటీ చేస్తోందని, టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కోరారు. చంద్రగిరి నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని,  చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి రెడ్డప్పని గెలిపించాలని అభ్యర్థించారు.  పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లగానే వైఎస్సార్‌ను తలచుకోండి..ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top