ఐదేళ్లుగా అంతులేని అవినీతి

YS Sharmila Comments On Chandrababu Govt In Election Campaign - Sakshi

గత 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయనన్ని అప్పులు చేశారు

చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకంటే దురదృష్టం ఉండదు

టీడీపీ మేనిఫెస్టో అంటూ ఓ కాపీ పుస్తకాన్ని తయారు చేశారు

సగం హామీలను వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టారు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఐదేళ్లుగా పాలన గాలికి వదిలేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్న చంద్రబాబుకు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని హెచ్చరించారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనన్ని అప్పులతోపాటు భారీ అవినీతి ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చోటు చేసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయకల్లాం స్వయంగా చెప్పడం దోపిడీకి నిదర్శనమన్నారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం, కాకినాడ, రామచంద్రపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘వైఎస్సార్‌ ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చి ఆదర్శంగా నిలిచారు. అన్ని వర్గాలకూ భరోసా కల్పిస్తూ పరిపాలించారు. ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచకుండా సుపరిపాలన అందించిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెన్నుపోటు, అవినీతి, అబద్ధాలకు మారుపేరు. రైతులకు రుణమాఫీ అంటూ ఆయన చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు.

డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను వంచించారు. పసుపు – కుంకుమ అంటూ ఎంగిలి చెయ్యి విదిలిస్తూ అన్నలా భావించి గెలిపించాలని అడుగుతున్నాడు ఈ దొంగబాబు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లినప్పుడు చంద్రబాబులో అన్న చచ్చిపోయాడా? గుంటూరులో కాలేజీ విద్యార్థిని రిషితేశ్వరి వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఈ అన్న ఎక్కడికి పోయారు? మధ్యాహ్న భోజన పథకం మహిళలు ఉద్యోగాలు తొలగించి తమ పొట్టకొట్టవద్దని వేడుకుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయించారు చంద్రబాబు. అంగన్‌వాడీలు ఆందోళన చేస్తే లాఠీచార్జీ చేయించారు ఈ చంద్రబాబు. నిజంగా ఇలాంటి అన్నే ఎవరికైనా ఉంటే అంతకంటే దురదృష్టవంతురాలైన మహిళ మరొకరు ఉండరు. 

ఆరోగ్యశ్రీని నీరుగార్చారు..
ఇవాళ ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించారు. సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. మరి చంద్రబాబు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆస్పత్రులకే వెళతారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. 

టీడీపీ మేనిఫెస్టోలో సగం కాపీ కొట్టినవే
చంద్రబాబు గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చి వాటిని పాతిపెట్టారు. కనీసం పాత మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో పెట్టే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అంటూ ఓ పుస్తకాన్ని తయారు చేశారు. ఐదేళ్లలో నెరవేర్చని వాగ్దానాలను మళ్లీ ఇందులో చేర్చారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీల నుంచి మరో 50 శాతం కాపీ కొట్టారు. పాత హామీల బకాయిలను వెంటనే చెల్లించమని చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు.  

ఆ డబ్బంతా ఏమైంది?
అనుభవజ్ఞుడినంటూ, హైదరాబాద్‌ అంతా తానే కట్టానంటూ గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిలో ఒక్కటైనా శాశ్వత భవనం నిర్మించారా? కనీసం ఓ ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. రాజధానికి కేంద్రం రూ.2,500 కోట్లిస్తే ఆ డబ్బంతా ఏమైంది? బాబొస్తే జాబొస్తుందన్నారు. చంద్రబాబు కుమారుడు పప్పు లోకేష్‌కు మాత్రమే మూడు ఉద్యోగాలొచ్చాయి. 

రేపు ఏం అంటారో ఆయనకే తెలియదు..
రాష్ట్రానికి ఊపిరి లాంటి హోదాను చంద్రబాబు నీరుగార్చారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి. ఆయనది రోజుకో మాట, పూటకో వేషం. జగనన్న హోదా కోసం చేయని పోరాటం లేదు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా అనటానికి కారణం జగనన్న కాదా? 

అప్పుడు మీ పౌరుషం చచ్చిపోయిందా?
చంద్రబాబు పౌరుషం, రోషం అంటూ తనకు సరిపడని మాటలు మాట్లాడుతున్నారు. మేం బీజేపీ, కేసీఆర్‌తో పొత్తులు పెట్టుకున్నామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే. అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని కబ్జా చేయడాన్ని పౌరుషం అంటారా? పిల్లి గట్టిగా పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోతుందా? మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. వైఎస్సార్‌ సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. జగనన్న ఓదార్పు అనే ఒక్కమాట కోసం కాంగ్రెస్‌ను వీడి సింగిల్‌గా బయటకు వచ్చారు. అదీ పౌరుషం, రోషం అంటే.  

పవన్‌ నటన.. చంద్రబాబు దర్శకత్వం
పవన్‌ కల్యాణ్‌ ఓ యాక్టర్‌. ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్‌. అందుకే పవన్‌ బాబు చెప్పినట్లే చేస్తున్నారు. ఇద్దరూ కలిసే ఉన్నారు, సీట్లు పంచుకున్నారు. జనసేనకు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టే. పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశారు. అన్న లాగే పవన్‌  కూడా ఇప్పుడో, ఎప్పుడో తన పార్టీనీ అమ్మేస్తాడు. కాకపోతే ఆయన టీడీపీకి అమ్మేస్తారు అంతే తేడా’’

ప్రజాతీర్పు.. బైబై బాబు
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇప్పుడు మీ భవిష్యత్‌– నా బాధ్యత..’  అంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు. గత ఐదేళ్లూ ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ ఒక్కడిదే ఆయన బాధ్యతా? పొరపాటున చంద్రబాబుకు ఓటేసి గెలిపిస్తే మీ భవిష్యత్తు నాశనం చేస్తారు. బైబై బాబు.. అంటూ అంతా ప్రజాతీర్పు చెప్పండి. మళ్లీ రాజన్న రాజ్యం కోసం జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top