ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్‌ జగన్‌

YS Jagan Reminds Emotional Moment In PrajaSankalpaYatra In Nellore Samara Shankaravam - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం సభలో.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా... ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే వైఎస్సార్‌ సీపీ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంటకాగిన బాబు ఏనాడు హోదా ఊసెత్తలేదని.. ఇప్పుడు మాత్రం నల్లచొక్కాలు వేసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ కూడా ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా హోదా కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని పేరొన్నారు. హోదా అంశంలో మోసం చేసిన కాంగ్రెస్‌, బీజేపీలను, పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఓట్లు తొలగిస్తూ నాటకాలు ఆడుతున్న టీడీపీ మోసాలు అరికట్టేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీవిజిల్‌ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.

మంగళవారం నాటి సమర శంఖారావం సభకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజక వర్గాల ప్రజలు, బూత్‌ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ప్రసంగం అనంతరం వైఎస్‌ జగన్‌ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో జూలూరుపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి ప్రశ్నకు బదులుగా...దుగ్గరాజపట్నం పోర్టు కచ్చితంగా నిర్మిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామ సెక్రటేరియట్‌ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

ఆ సంఘటన నన్ను కలచివేసింది..
నెల్లూరులో సాగిన పాదయాత్రలో భాగంగా మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా అని ఉదయగిరికి చెందిన సుబ్బారెడ్డి ప్రశ్నించగా... ‘పాదయాత్ర చేస్తున్నపుడు ఒక సంఘటన నన్ను కలచివేసింది. ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఆ అన్న పేరు గోపాల్‌ అనుకుంటా. వారి గుడిసెలో ఒక ఫొటోకు దండవేసి ఉంది. ఈ విషయం గురించి గోపాలన్న చెబుతూ... ‘అన్నా ఫ్లెక్సీలో దండవేసి ఉన్న వ్యక్తి నా కొడుకు. మంచి మార్కులు వచ్చేవి. అందుకే ఇంజనీరింగ్‌లో చేర్పించాలని ఆశపడ్డా. మమ్మల్ని పైకి తీసుకువస్తాడనుకున్నా. అయితే ఆ చదువుకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చయ్యేవి. ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా 30 నుంచి 35 వేలు మాత్రమే వచ్చేవి. రెండో ఏడాది అవి కూడా రాలేదు. దీంతో తన చదువు కోసం నేను అప్పులు చేయడం తట్టుకోలేక... నా కొడుకు కాలేజీకి వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అది నేను మరచిపోలేని సంఘటన. ఆరోజు నా కళ్లలో నీళ్లు వచ్చాయి’ అని వైఎస్‌ జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

వారందరికీ హామీ ఇస్తున్నా..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించిన వైఎస్‌ జగన్‌... ‘గోపాల్‌ అన్నకు హామీ  ఇచ్చినట్లుగా పేదరికం పోవాలంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంటుకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను చదివిస్తా. హాస్టల్లో ఉండే ప్రతీ పిల్లాడికి మెస్‌ చార్జీలకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తాం’  అని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలను స్కూలుకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయల సాయం చేస్తాం. అప్పులు చేయకుండానే తమ పిల్లలు చదువుకునే పరిస్థితి తీసుకువస్తా అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top