మీ గూండాలే.. కాదు మీ వాళ్లే

War Of Words Between TMC and BJP Over Clashes In Amit Shah Rally - Sakshi

ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహ ధ్వంసంపై

బీజేపీ, టీఎంసీ పరస్పరారోపణలు

సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), బీజేపీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దాడికి కారకులు మీరంటే మీరేనంటూ ఇరు పార్టీలూ పరస్పరారోపణలు చేసుకుంటున్నాయి. బెంగాల్‌లో ఏం జరుగుతున్నా ఎన్నికల సంఘం (ఈసీ) మౌనం వహించి, చూస్తూ ఉంటోంది తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఇరు పార్టీలూ బుధవారం ఆరోపించాయి. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేశాయి. తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ కార్యకర్తలేనని అమిత్‌ షా ఆరోపించగా, బీజేపీ కార్యకర్తలు కళాశాల గోడలు దూకి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలను టీఎంసీ విడుదల చేసింది.  

హింసకు మమతదే బాధ్యత: అమిత్‌ షా
కోల్‌కతాలో తన ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు టీఎంసీ గూండాల పనేనని అమిత్‌ షా ఆరోపించారు. అమిత్‌ బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తూ దాడులకు తెగబడుతున్నారని, అక్రమంగా పోలింగ్‌ బూత్‌లలోకి చొరబడుతూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తత్వవేత్త ఈశ్వర్‌ చంద్ర విగ్రహాన్ని కూడా టీఎంసీ కార్యకర్తలే ధ్వజం చేశారని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంత హింసను వ్యాప్తి చేసినా ఎన్నికల్లో గెలవబోదనీ, ఎంత బురదజల్లినా అందులోంచి కమలం తప్పక వికసిస్తుందని షా వ్యాఖ్యానించారు. ‘సేవ్‌ బెంగాల్‌.. సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో బీజేపీ బుధవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగింది.
 
ఈసీకి ఆధారాలు సమర్పించిన టీఎంసీ
విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసింది బీజేపీ కార్యకర్తలే అన్న తమ ఆరోపణలకు ఆధారాలను ఈసీకి టీఎంసీ బుధవారం సమర్పించింది. టీఎంసీ నేతలు డెరెక్‌ ఒబ్రెయిన్, సుఖేందు శేఖర్‌ రే, మనీశ్‌ గుప్తా, నదీముల్‌ హాక్‌ల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. అంతకుముందు ఒబ్రెయిన్‌ మీడియాతో మాట్లాడుతూ ‘కోల్‌కతా వీధులను విస్మయం, ఆగ్రహం ఆవహించింది. మంగళవారం జరిగిన ఘటన బెంగాలీల గౌరవాన్ని దెబ్బతీసింది. అమిత్‌ షా ర్యాలీలో చెలరేగిన హింసకు సంబంధించిన 44 వీడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top