చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదు : రెహమాన్‌

Visakha TDP Leader Rehman Fires On Chandrababu Over NRC - Sakshi

టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు రెహమాన్‌

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను స్వాగతిస్తున్నట్టు వెల్లడి

అమరావతి రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్‌.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు.  చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లు వల్ల కొంతమంది భారతీయుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు తమ మైనార్టీలంతా రుణపడి ఉన్నామన్నారు. 

ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్నార్సీ బిల్లుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ రాజధాని కావాలని తాము గతంలోనే కోరామని.. అందుకోసం తను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. గత ఐదేళ్ల చంద్రబాబు విధానాల వల్ల పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరని.. కొంత మంది నాయకులు మాత్రమే బాగుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని అనేది విశాఖ ప్రాంతవాసుల కల అని చెప్పిన రెహమాన్‌.. విశాఖ క్యాపిటల్‌ కావడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై కులాల ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చరిత్రలో హీనంగా మిగలదల్చుకోలేదని.. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎన్నార్సీని వ్యతిరేకించనందుకు టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top