‘చిత్తూరు’లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన | Sakshi
Sakshi News home page

‘చిత్తూరు’లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Published Sun, Apr 29 2018 3:29 AM

Violation of election code in Chittoor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షం నియమావళిని ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) ఆర్‌.పి.సిసోడియాను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 26న నోటిఫికేషన్‌ వెలువడటంతో ఎన్నికల నియమావళి(కోడ్‌) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన.. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీకి సంబంధించిన జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. అయితే 30న తిరుపతిలో టీడీపీ బహిరంగసభ ఉందంటూ జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.

ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తెస్తున్నట్టు భూమన వివరించారు. ఇలా అధికార దుర్వినియోగం చేయడం సరికాదని, టీడీపీకి మినహాయింపునివ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ పేరుతో బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలు కట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. చంద్రబాబు తన సభను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు వాడుకునే వీలుందని అనుమానం వెలిబుచ్చారు.

తమ వినతిని పరిగణనలోకి తీసుకున్న సీఈవో చిత్తూరు కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు భూమన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే మాట ఎత్తితేనే జైలుకు పంపిస్తానని చెప్పిన సీఎం ఇపుడు ప్రత్యేక హోదా సాధనకు దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 30న తిరుపతిలో జరిగేది దొంగల సభని ధ్వజమెత్తారు. 

Advertisement
Advertisement