
సాక్షి, అమరావతి : తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులం.. పచ్చ దొంగలకు కాదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా అధికారంలో ఉండగా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ టీడీపీ బండారం త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది’ అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అదే విధంగా బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు క్రమంగా ఆ పార్టీలో కంట్రోల్ తీసుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు...‘ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కార్యదర్శులను పక్కకు నెట్టి కొత్తగా పార్టీలో చేరిన బాబు కోవర్టులు కంట్రోలు తీసుకుంటున్నారు. మొన్న గవర్నర్ గారిని కలిసిన సుజనాచౌదరి బృందాన్ని చూస్తే అర్థమవుతుంది. అమిత్ షా గారి కంటే ఈ బానిసలకు నారా చంద్రబాబు నాయుడే ముఖ్యం’ అంటూ ట్వీట్ చేసి ప్రధానమంత్రి కార్యాలయం, బీజేపీ ఫర్ ఇండియాను ట్యాగ్ చేశారు.