చంద్రబాబు ఏపీ సీఈవోనే బెదిరించారు

Vijaya Sai Reddy Complaint To EC On Chandrababu  - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

సీఎం చర్య ఈసీ విధులకు ఆటంకం కలిగించడమే

వీటిని తీవ్రంగా పరిగణించాలి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర సీఈవోతో చంద్రబాబు జరిపిన సంభాషణల వివరాలు ఈసీకి అందజేత    

కుయుక్తులకు పాల్పడుతున్నారంటూ మరో ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో)ని బెదిరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం సీఈవోను కలసిన సీఎం బెదిరింపులకు దిగారని తెలియజేస్తూ.. ఆ సందర్భంగా సీఈవోతో సీఎం జరిపిన సంభాషణ వివరాలను ఇందులో తెలియజేశారు. ‘‘ఎవరు వెరిఫైయింగ్‌ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు(ఎలక్షన్‌ కమిషన్‌) చూడాలి. ఇక మీ ఆఫీస్‌ ఎందుకు? క్లోజ్‌ చేసేయండి. ఎలక్షన్‌ కమిషన్‌ ఎవరు? నేను అడుగుతున్నా. సరిగా కండక్ట్‌ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్‌. మేం ఇంట్లో పడుకుంటాం. ఢిల్లీ చెప్పినట్టు యాజ్‌టీజ్‌గా మీరు ఎందుకు ఫాలో కావాలి? మీది పోస్ట్‌ ఆఫీస్‌ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే అన్నీ రద్దు చేసేయమనండి. అందరినీ తీసేయమనండి. ఒక్క క్లర్క్‌ను పెట్టుకుని చేసేయమనండి. మేం చూస్తాం. ఎన్నికల కమిషన్‌ ఏంటో చూస్తాం. అంత ఈజీగా వదిలిపెట్టను..’’ అని సీఈవోను బెదిరించినట్టు ఫిర్యాదులో వివరించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, దాని పరిధిలో సీఈవో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగేలా తన విధులు నిర్వర్తిస్తారని గుర్తుచేశారు. దేశంలోని ప్రతి రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలని, నిష్పాక్షికంగా తన రాజ్యాంగ విధులను నిర్వహించేలా చూడాల్సి ఉందన్నారు. రాజ్యాంగ విధిలో ఉన్న సీఈవో పట్ల చంద్రబాబు ఎలాంటి గౌరవం చూపలేదని, అంతేగాక ప్రచారం ముగిశాక సీఈవో వద్దకెళ్లి ఉద్దేశపూర్వకంగా ఆయన్ను బెదిరించారని తెలిపారు. ఈసీకి, సీఈవోకు భయం పుట్టించేలా ఈ బెదిరింపు ఉందని నివేదించారు. తద్వారా ఈసీ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ఇలాంటి బెదిరింపులు చట్టవ్యతిరేకమని, అవాంఛితమని, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విన్నవించారు. చంద్రబాబు ఇలా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని, చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఈవోను బెదిరింపులకు గురిచేసిన తీరుపై వీడియో ఆధారిత సాక్ష్యాలను విజయసాయిరెడ్డి ఈసీకి సమర్పించారు.

కుయుక్తులకు తెరలేపుతున్నారు.. 
వైఎస్సార్‌ జిల్లాలో పోలీసు యంత్రాంగం సాయంతో ఎన్నికలకు విఘాతం కలిగించేలా శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలని టీడీపీ, ఆ పార్టీ అధినేత కుట్రలు పన్నినట్టు తమకు సమాచారముందని విజయసాయిరెడ్డి ఈసీకి అందజేసిన మరో ఫిర్యాదులో విన్నవించారు. ఈ(గురువారం) మధ్యాహ్నం నుంచి ఈ కుట్రలను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోందని తెలిపారు. బూత్‌ల రిగ్గింగ్‌కు పాల్పడడం, ఆక్రమించడం, ఓటర్లను బెదిరించడం, పోలీసుల సహకారంతో హింసకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదముందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ఏజెంట్లను అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లాకు చెందినందున అక్కడ హింసాకాండకు పాల్పడి దాన్ని జగన్, వైఎస్సార్‌సీపీ చేసిన హింసాకాండగా చిత్రించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నారని వివరించారు. వైఎస్సార్‌సీపీ గెలిస్తే రాష్ట్రమంతా ఇలాంటి హింసాత్మక వాతావరణం ఉంటుందని చిత్రించేందుకు ఈ కుట్రలకు తెరలేపారన్నారు. తక్షణ చర్యలు తీసుకుని అదనపు బలగాలను పంపాలని కోరారు. పోలీసు యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని, రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top