
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సానుభూతి కోసం డ్రామా ఆడాల్సిన అగత్యం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని, నాలుగున్నర ఏళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలప్పుడే రుణమాఫీ అన్న ఒక్క అబద్ధం ఆడి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను తప్ప.. ఆచరణ సాధ్యం కాని రుణమాఫీ హామీ ఇవ్వబోనని అన్నారని, ఒకవేళ ఆయన అప్పుడు ఆ హామీ ఇచ్చి ఉంటే చంద్రబాబు మళ్లీ జీవితంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదని స్పష్టంచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడితో గాయపడిన ప్రతిపక్ష నేతను మాటవరుసకైనా పరామర్శించని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నరరూప రాక్షసుడితో పోల్చారు. అబద్ధపు హామీలు ఇవ్వడం, ప్రజలను మోసం చేయడం, సానుభూతి కోసం డ్రామాలు ఆడటం చంద్రబాబుకు వచ్చిన విద్యలని.. వాటన్నింటినీ ఎదుటివారి మీద రుద్దడం ఆయన అలవాటని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబూ.. అసలు నీలో మానవత్వం మచ్చుకైనా ఉందా’’అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతపై కత్తి దాడి జరిగితే కనీసంపరామర్శించని బాబు.. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని మండిపడ్డారు. పైగా సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని చంద్రబాబు అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దాదాపు 365 రోజులూ జనంలో తిరిగే జగన్‌మోహన్‌రెడ్డికి కొత్తగా సానుభూతి అవసరం లేదని, ఆయన ఇప్పటికే భారీ ప్రజాదరణ కలిగి ఉన్నారని వేమిరెడ్డి స్పష్టంచేశారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెళ్లి మావోయిస్టుల తీరుకు నిరసనగా దీక్ష చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడిపై దాడి జరిగితే చంద్రబాబు వెకిలి చేష్టలు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని విమర్శించారు. ‘‘నేను ఆ భగవంతుడిని కోరుతున్నా.. చంద్రబాబూ నీ లాంటి మనస్తత్వం, నీ బుద్దులు ఈ భూమి మీద మరొకరికి రాకూడదు. ఇప్పటికే నీ వికృత చేష్టలు నీ పార్టీ నేతలకు రావడం చూసి ఏపీ ప్రజలు విస్తుపోతున్నారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నువ్వు ఏపీకి చీడపురుగుతో సమానం’’అని వేమిరెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.