నల్లగొండలో నగారా!

TRS preparations for large Public meeting - Sakshi

భారీ సభకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు

ఈ నెలలోనే అట్టహాసంగా నిర్వహణ

సభా వేదిక నుంచే ఎన్నికల శంఖారావం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సమరానికి భారీ బహిరంగ సభ ద్వారా శ్రీకారం చుట్టేందుకు టీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతోంది. ఉద్యమాల ఖిల్లా అయిన నల్లగొండ జిల్లాను ఇందుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించింది. ఆగస్టులో ఈ బహిరంగ సభ ద్వారా ఎన్నికలకు సమర శంఖం పూరించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిశ్చయించినట్టు సమాచారం.

ముందుస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్న కేసీఆర్, ఈ సభ ద్వారా ఆ మేరకు సంకేతమివ్వనున్నారు. ఎన్నికలకు ముందు సభ ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలన్నది టీఆర్‌ఎస్‌ యోచనగా ఉంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ అగ్ర నేతలను కట్టడి చేయడమనే ద్విముఖ వ్యూహంతో నల్లగొండను వేదికగా ఎంచుకున్నట్టు తెలిసింది.

ఎన్నికల శంఖారావమే
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బహిరంగ సభలనే ఆయుధంగా టీఆర్‌ఎస్‌ మలచుకున్న తీరు తెలిసిందే. ఒక్కోసారి ఏడాదిలోనే రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర కూడా టీఆర్‌ఎస్‌కు ఉంది. అలాంటిది అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఏడాదికి ఒక్క భారీ సభ కూడా నిర్వహించలేదు. ఎక్కువగా ప్రభుత్వపరంగానే బహిరంగ సభలు జరిపారు.

ప్రభుత్వపరంగా అయితే సభలకు పరిమితులు ఉంటాయనే ఉద్దేశంతో ఈసారి పార్టీపరంగానే సభను భారీగా జరపాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మందితో భారీ ఎత్తున సభ నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. సీఎం కేసీఆర్‌ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు.

అదే జరిగితే ఆగస్టులో బహిరంగ సభ ద్వారా శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం తొందరపాటేమీ కాబోదన్నది కేసీఆర్‌ భావన అంటున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ సభను గత సభల కంటే భారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర బాధ్యతలను ఇప్పటికే నల్లగొండ జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు అప్పగించారు.

నల్లగొండ కాంగ్రెస్‌ అగ్ర నేతలే లక్ష్యం...
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతల్లో అత్యధికులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పీసీసీ పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి సోదరులది నల్లగొండ జిల్లానే. జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉందనే ధీమాతో ఉన్న ఈ నేతలను, కాంగ్రెస్‌ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి సభను ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

నల్లగొండలోనే టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదనే సందేశమిచ్చేలా సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దక్షిణ తెలంగాణలోనే కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నామనే విశ్వాసాన్ని టీఆర్‌ఎస్‌లో పెంచడంతో పాటు, కాంగ్రెస్‌ శ్రేణులను కకావికలం చేసేందుకు సభను వినియోగించుకోవాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top