చెన్నూర్‌లో అధికారపక్షంపై అలక..

TRS Candidate Resigns in Chennur Mancherial - Sakshi

బాల్క సుమన్‌ మాట తప్పారని అభ్యర్థి ఆవేదనపార్టీకి రాజీనామా..     

పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

ఎమ్మెల్సీ చర్చలతో     దిగివచ్చిన అభ్యర్థి

పోలింగ్‌కు ముందురోజు ఊహించని షాక్‌..?

మంచిర్యాల, చెన్నూర్‌: చెన్నూర్‌ టీఆర్‌ఎస్‌లో పోలింగ్‌కు ముందు ముసలం మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా అర్చనరాంలాల్‌గిల్డాను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రకటించారు. దీంతో ఆరో వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ సర్పంచ్‌ కృష్ణ భార్య సాధనబోయిన లావణ్య తన ఇంటివద్దే కృష్ణ మద్దతుదారులు నిరసనకు దిగారు. మొన్నటివరకు లావణ్యను చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు బాల్క సుమన్‌ మాట తప్పారని కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ కృష్ణ ఇంటికి వచ్చి నిరసన నిలిపివేయాలని చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దీంతో కృష్ణ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఆరో వార్డులో చేస్తున్న పోటీనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చెన్నూర్‌ మున్సిపాలిటీలో 18 వార్డులకు ఏడు వార్డులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యేందుకు చక్రం తిప్పిన విప్‌ సుమన్‌.. తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. చైర్‌పర్సన్‌ ప్రకటన చేయడంతో సొంత పార్టీలోనే నిరసన ప్రారంభం కావడం విశేషం. 

అలక వీడిన అభ్యర్థి
నిరసనకు దిగిన అభ్యర్థిని ఇంటికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌  మరోమారు వెళ్లి వారిని సముదాయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. చైర్‌పర్సన్‌ ఎంపికకు ఈనెల 28వరకు సమయం ఉండడంతో ఆలోపు ఆలోచిద్దామని, అప్పటివరకు వేచి ఉండాలని సూచించారు. విప్‌ సుమన్‌ ఇదే విషయం తెలిపారని పేర్కొన్నారు. దీంతో సదరు అభ్యర్థి అలకవీడి.. రాజీనామా వెనక్కి తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top