పాలమూరు ఆగమైంది: ప్రొఫెసర్‌ కోదండరాం

TJS Kodandaram slam on KCR Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: కేసీఆర్‌ పాలనలో పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జిల్లాలను విభజించి పాలమూరు ముఖచిత్రాన్ని మార్చేశారని, ఫలితంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కలెక్టర్‌ కార్యాలయాలు ఎక్కడో తెలియక పనులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీమైదానంలో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు.

జిల్లాలో కృష్ణానది జూరాల వద్ద ప్రవేశించి శ్రీశైలం వద్ద బయటకు వెళ్తుందని, జిల్లాకు నీళ్లు రావాలంటే జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయాల్సి ఉందన్నారు. కానీ శ్రీశైలం నుంచి లిఫ్టుల ద్వారా ఎత్తిపోస్తే దిగువకుపోయిన నీళ్లు పైకి ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కోదండరాం విమర్శించారు. గ్రామాల్లో 144 సెక్షణ్‌ విధించి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు ఎంపీగా అవకాశమిచ్చి ఉద్యమ నాయకుడిగా తయారుచేస్తే ఇక్కడి ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు.

హామీలను గాలికొదిలారు 
ప్రభుత్వం భర్తీచేస్తామన్న లక్షన్నర ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో యువత ఆగమైందన్నారు. రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవన్నారు. ఇన్నేళ్లు చదివినా ఉద్యోగం రాలేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు జీఓ నం.68, 90 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, ఎస్టీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామన్న ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు.

మన వాళ్లు పరాయి వాళ్లయ్యారు  
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ప్రజాసమస్యలను విన్నవించే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాలు, బెదింపులకు పాల్పడుతుందన్నారు. చివరికి నిరసన తెలిపేందుకు లేకుండా చేసి ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు సీఎంను కలిసేందుకు వెళ్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలు పోతే గుర్తుపట్టే నాయకులు లేరన్నారు. అందుకే మనవాళ్లు ప్రభుత్వానికి పరాయివాళ్లు అయ్యారని విమర్శించారు. చెక్కుల పంపిణీలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పూర్తిన్యాయం జరగాలంటే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశామని వివరించారు. 

పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత నైరాశ్యంతో ఉంది. ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పాటు చేశాం. – టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 

తెలంగాణ ప్రజల కష్టాలు చూసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. కానీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలను మోసం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.. – ఆర్‌ఎల్డీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌

గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేద్దాం 
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి నుంచి ఎవరికి టికెట్‌ వచ్చినా  అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేస్తామని, తెలంగాణలో నియంతృత్వ పాలన అంతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, రైతుబిడ్డగా తనకు కష్టాలు తెలుసన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇటీవల కొండగ ట్టు బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించా రు.  టీజే ఎస్‌ రాష్ట్ర నాయకులు దిలీప్‌కుమార్, బబ్రూది న్, నాయకులు నర్సింహయ్య, బాల్‌కిషన్, సాజిదాసికింద్, దేవ రాజ్‌తో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి భారీసంఖ్యలో  కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్‌ మాట తప్పారు 
అంతుకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్‌సింగ్‌ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేశారని  విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగా ణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను చూసే పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో దశ తెలంగాణ ఉద్యమం పాలమూరు నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కోదండరాం నేతృత్వంలో ప్రజలు నడవాలని, జనసమితి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top