టీడీపీ దుష్ప్రచారాలపై ఆధారాలున్నాయి

There are evidence on TDP negative propaganda - Sakshi

మెకాన్‌ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు?

మీది తెలుగు డ్రామా పార్టీ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు విషయంలో టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తన దగ్గర ఆధారాలున్నాయని, వాటికి సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘కడప స్టీల్‌ ప్లాంటును వయబుల్‌ చేయడానికి మెకాన్‌ సంస్థను కన్సల్టెన్సీగా, టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా నియమించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ఈ కమిటీ 6 సార్లు సమావేశమైంది. నాలుగోసారి సమావేశం 2017 నవంబర్‌ 23న జరిగింది. కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, అప్పటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వై.ఎస్‌.చౌదరి, ఏపీ మైనింగ్‌ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు పాల్గొన్నారు. మెకాన్‌ కన్సల్టెన్సీ సంస్థ ఫీజుబిలిటీ రిపోర్టు తయారు చేస్తే ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. కానీ 8 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోంది. స్టీల్‌ తయారీకి కావాల్సిన ముడి సరుకు ఐరన్‌ ఓర్‌ ఎంత లభ్యత ఉందో అంచనా వేసి నెలరోజుల్లో చెప్పాలని మిమ్మల్ని కోరితే ఇప్పటికీ ఇవ్వలేదు. మీరు వెంటనే చిత్తశుద్ధి చూపి సరైన వివరాలు చెబితే ఫీజుబిలిటీ రిపోర్టు కొలిక్కి వచ్చేది. మీరు  డ్రామాలకు పరిమితమయ్యారు. మీది తెలుగు డ్రామా పార్టీ. 

ప్రతిపక్షానికో బీజేపీకో లాభిస్తుందని భయం
ఈనెల 12న ఆరో సమావేశం జరిగింది. మళ్లీ అదే స్పష్టం చేశారు. అది ప్రతిపక్ష నాయకుడికి చెందిన జిల్లా కాబట్టి ఆయనకు లాభిస్తుందేమో.. లేక బీజేపీకి లాభిస్తుందేమో.. అన్న సంకుచిత మనసుతో మీరు వ్యవహరిస్తున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా రచ్చ చేస్తున్నారు. ఓబులాపురం ఉన్న 8 గనుల నుంచి కడప స్టీల్‌ ప్లాంటుకు ఐరన్‌ ఓర్‌ సరఫరా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్రం చెబుతోంది. కానీ అందులో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మరి ఎలా సరఫరా చేస్తారని అడిగితే సమాధానం లేదు. దీక్షకు కూర్చుంటామని చెబుతున్న నేతలు ఈ ప్రశ్నలను టీడీపీ అధ్యక్షుడిని అడగాలి’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top