బహుజనులకే సీఎం పీఠం

Thammineni veerabhadram Fires On Cm KCR - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం

వేగంగా విస్తరిస్తున్న    బీఎల్‌ఎఫ్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ (బహుజన లెప్ట్‌ ఫ్రంట్‌) వేగంగా విస్తరిస్తోందని, సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం అజెండాను ముందుకు తెచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్‌ వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ, అగ్రవర్ణ పేదలను కలుపుకొని బీఎల్‌ఎఫ్‌ సంచలనం సృష్టించనుందని ఆయన చెప్పారు. బీసీలకు 65 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని.. తద్వారా బహుజనులకే సీఎం పీఠం దక్కనుందని తెలిపారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ముఖ్యమంత్రి పదవి బహుజనుల కు ఇస్తామని ప్రకటించే దమ్ము, ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమ మహాజన పాదయాత్ర అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులాలకు తాయిళాలు ప్రకటించాడని.. గొర్రెలు, పందులు, చేపలు, పరికరాలు ఇస్తామని చెబుతూ ఇదే సామాజిక న్యాయం అంటున్నాడని విమర్శించారు. అయితే, ఇది సామాజిక న్యాయం కాదని, కేవలం సహాయం మాత్రమేనని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో వాటా, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు, సంపదలో, అన్నింటా అందరికీ వాటా వర్తిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. బీఎల్‌ఎఫ్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఆర్‌.కృష్ణయ్య, మందకృష్ణ, కోదండరాం తదితరులతో ఇదివరకే అనేక దఫాలుగా చర్చలు కూడా జరిపామన్నారు. ఈ నెల 22న జరిగే బహిరంగ సభలో బీఎల్‌ఎఫ్‌ విధివిధానాలను ప్రకటించి మే 1 నుంచి వివిధ జిల్లాల్లో పర్యటనలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు పోటీలో ఉంటారని, అలాగే జూన్‌లో జరిగే జెడ్పీ ఎన్నికల్లో కూడా బీఎల్‌ఎఫ్‌ కామన్‌ గుర్తు సాధించి ఎన్నికల బరిలో దిగుతామని వెల్లడించారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పార్టీలు..
ప్రజా సంక్షేమాన్ని అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీలు పూర్తిగా విస్మరించాయని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన రైతుల ఆత్మహత్యలు.. టీఆర్‌ఎస్‌ హయాంలో మరింత పెరిగిపోయాయన్నారు. బీఎల్‌ఎఫ్‌ సమగ్ర తెలంగాణ అభివృద్ధి, సమగ్ర న్యాయం అనే నినాదంలో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సామాజిక నిర్వచనమే లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూ పాలనలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని, ఎన్నికలు వస్తే తాము అధికారంలోకి వస్తామని ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు వైద్యానికి తూట్లు పొడిచాయని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యంపై ఆధారపడి బడ్జెట్‌ను రూపొందించుకుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యూనివర్సిటీలను ప్రైవేట్‌పరం చేస్తుందని, తద్వారా ఉన్నత విద్యను దూరం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ జలజం సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, నాయకులు జయరాములు, గులాం గౌస్, కిల్లె గోపాల్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top