తెరపైకి కొత్త పేరు

Telangana ZP Chairmans Selections Mahabubnagar - Sakshi

నాగరకర్నూల్‌: కందనూలు జిల్లా ఏర్పడిన తరువాత మొదటిసారిగా జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు శనివారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 17 మంది టీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గెలవగా, ముగ్గురు కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు విజయం సాధించారు. జిల్లాలోని తాడూరు, వంగూరు, అమ్రాబాద్‌ మండలాలు మినహా మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌ నెగ్గింది. శనివారం జరిగే జెడ్పీ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎన్నిక లాంఛనమే.

జెడ్పీచైర్మన్‌గా పద్మావతి
జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ జెడ్పీచైర్మన్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినా.. అనూహ్యంగా తెరపైకి మరో కొత్తపేరు తీసుకొచ్చారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తెలకపల్లికి చెందిన పద్మావతి పేరును శుక్రవారం రాత్రి అధిష్టానం ఖరారు చేసి, బీ–ఫాం అందజేసింది. ఖరారు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన బాలాజీసింగ్‌కు జెడ్పీ వైస్‌చైర్మన్‌గా అవకాశం కల్పిచేందుకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుతో పాటు ఎంపీ రాములు అచ్చంపేటకు చెందిన వారే కావడంతో పాటు బాలాజీసింగ్‌ అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. దీంతో ఎంపీ, జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ అన్ని పోస్టులు అచ్చంపేట నియోజకవర్గానికి ఎలా ఇస్తారని కొందరు నాయకులు పార్టీ పెద్దల ముందు ఉంచారు. దీంతో తెలకపల్లి జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ తరుఫున గెలిచిన పద్మావతికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ రాములు, తదితరులు  హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మరీ పట్టబట్టి పద్మావతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
 
అధికారుల ఏర్పాట్లు పూర్తి.. 
జిల్లా జెడ్పీచైర్మన్‌ ఎంపిక కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ దగ్గరుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని డిజిటల్‌ క్లాస్‌రూంలో ఏర్పాట్లు చేయించారు. ఉదయం 9గంటలకు ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదటి కో–ఆప్షన్‌ సభ్యులకు సంబంధించి 10గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన, ఉప సంహరణ అనంతరం ఒంటిగంట వరకు కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. 3 గంటలకు జిల్లా జెడ్పీచైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికైన చైర్మన్, వైస్‌ చైర్మన్‌ సభ్యుల పేర్లను వెల్లడించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top