కౌంటింగ్‌ టెన్షన్‌!

TDP Leaders Tensions With Andhra Pradesh Results - Sakshi

ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక

పోలింగ్‌ రోజు ఘటనలు పునరావృతం కావచ్చు

నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ అప్రమత్తం

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత అమలు

144 సెక్షన్‌తో సమూహాల కట్టడికి చర్యలు

గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలపై ప్రత్యేక దృష్టి

సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడటం ఒకవైపు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ  రేపుతుండగా మరోవైపు పోలీసు వర్గాల్లో టెన్షన్‌ పెంచుతోంది. రాష్ట్రంలో కౌంటింగ్‌ రోజు అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్‌ తాజా హెచ్చరికలే ఇందుకు కారణం. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ రోజు అధికార టీడీపీపలు జిల్లాల్లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ రోజు టీడీపీ శ్రేణులు నేరుగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగినప్పటికీ కట్టడి చేయడంలో పోలీసులు విఫలం కావడం విమర్శలకు దారి తీసింది. ఘర్షణలుజరిగిన పోలింగ్‌ కేంద్రాల వద్ద కేవలం ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మాత్రమే ఉండటంతో దాడులను నిలువరించలేకపోయారు. 

26 చోట్ల చెలరేగిన హింస..
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ రోజు 26 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల దాడులు జరిగాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించి ఓటర్లను భయపెట్టి ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రలకు తెర తీశారు. పోలింగ్‌ రోజు టీడీపీ శ్రేణులు హింసకు దిగడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒకరు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడటం శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించి వీరాపురంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

దీన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్‌ శ్రేణులు ప్రయత్నించడంతో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వేట కొడవళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకట రమణప్పను టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి  హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణితోపాటు పలు చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. పోలింగ్‌ అనంతరం కూడా నాలుగు రోజులపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దాడులను కొనసాగించడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ రోజు కూడా ఇది పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

పోలీస్‌శాఖ అప్రమత్తం
ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిపై ఓ కన్నేసి ఉంచాలని, కౌంటింగ్‌ సందర్భంగా అసాంఘిక శక్తులు అలజడులకు దిగకుండా కట్టడి చేయాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈవీఎంల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పుకార్లు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతోపాటు రాజకీయ పార్టీల శ్రేణులు సమూహాలుగా చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. స్టేట్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సుతోపాటు కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తుపై ఉన్నతాధికారులు జిల్లాలవారీగా వీడియో, టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు అనివార్యమనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయని, దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మార్పు ఖాయమని తేలడంతో...
రాష్ట్రంలో మార్పు అనివార్యమనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయని, దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాల బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, హోరాహోరీ పోరు సాగిన చోట్ల ఓట్ల లెక్కింపు సమయంలో టెన్షన్‌ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పోలీస్‌ బాస్‌కు నివేదించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top