చీరాలలో ‘క’రణమే!

TDP Leader Karanam Balaram Will Contest From Cheerala Constistency - Sakshi

టీడీపీలో బీసీలకు మొండిచేయి

అమరావతిలో చీరాల నేతలతో చంద్రబాబు సమావేశం

బీసీలకు టికెట్‌ ఇవ్వాలన్న ఓ వర్గం

బలరాంను నిలపాలంటూ మరోవర్గం పట్టు

సర్వే ప్రాతిపదికన అభ్యర్థి ఎంపిక ఉంటుందన్న సీఎం

బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థుల ఎంపిక

ఏలూరి, గొట్టిపాటి, బీఎన్‌లకు అవకాశం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి పేరు దాదాపు ఖాయమైంది. ఇటీవల అధికార పార్టీని వీడిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై కరణంను నిలపాలని ముందే నిర్ణయించిన ముఖ్యమంత్రి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని  వ్యక్తపరిచేందుకు సీఎం శనివారం చీరాల టీడీపీ నేతలతో అమరావతిలో మొక్కుబడి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. చీరాల నుంచి కరణం బలరాంను అభ్యర్థిగా నిలిపితే అక్కడి బీసీలకు టీడీపీ మొండిచేయి చూపినట్లే. తమకే ఈ సారి టికెట్‌ కేటాయించాలని అక్కడి బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీమంత్రి పాలేటి రామారావు తనకే టికెట్‌ ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి పెంచారు.

మరోవైపు ఎమెల్సీ పోతుల సునీత సైతం తనకు అవకాశం కల్పించాలని  తొలుత ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ఆ తరువాత సీఎం మదిలోని కరణంను నిలపాలన్న ఆలోచనను పసిగట్టిన సునీత చివరకు కరణం అభ్యర్థిత్వానికే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చీరాల అభ్యర్థిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి మొక్కుబడి సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి పాలేటి, ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు నియోజకవర్గానికి చెందిన 140 మందికి పైగా నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. పాలేటి తాను పార్టీ అభివృద్ధి కోసం  నిరంతరాయంగా కృషిచేస్తున్నానని, కష్టాన్ని గుర్తించాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. పలువురు బీసీ నేతలు ఈ సారి చీరాల టికెట్‌ బీసీలకు కేటాయించాలని సీఎంను కోరారు.

బీసీ అభ్యర్థి ప్రతిపాదనన పట్ల సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో ఆ ప్రతిపాదన చేసిన బీసీ నేతలను ముఖ్యమంత్రి కసరుకున్నట్లు సమాచారం. మంచి అభ్యర్థిని నిలపాలని, విజయం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఎమెల్సీ పోతుల సునీత సీఎంకు చెప్పారు. తనకు చీరాల పరిస్థితి మొత్తం తెలుసని, అన్ని సర్వే రిపోర్ట్‌ లు తనవద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. తానే అభ్యర్థిని సూచిస్తానని తాను ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించుకు రావాలని  ముఖ్యమంత్రి నేతలనే ఆదేశించినట్లు తెలుస్తోంది. సమావేశంలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించ లేదు. 

బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థులు వీరే..
అనంతరం శనివారం బాపట్ల పార్లమెంట్‌ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ప్రధానంగా చీరాలతో పాటు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్‌ కేటాయింపులపై చర్చ జరిగింది. అనంతరం బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని అన్ని స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు సిట్టింగ్‌ అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. పార్లమెంట్‌ స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, రేపల్లె అసెంబ్లీకి సిట్టింగ్‌ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, బాపట్లకు అన్నం సతీష్‌ ప్రభాకర్, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు, చీరాల కరణం బలరామకృష్ణమూర్తి, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు బీఎన్‌ విజయ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిలో కరణం బలరాం విషయం మాత్రం ఒకటి రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తానన్నట్టు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top