మత్స్యకారుల నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరిక

TDP Leader Anil Babu Join In YSR CP PSR Nellore - Sakshi

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, కావలి ఇన్‌చార్జి బీద మస్తాన్‌రావుకు తీర ప్రాంత గ్రామాల్లో 20 ఏళ్లుగా కీలకమైన అనుచరుడు, మత్స్యకారులు నాయకుడు కొండూరు అనిల్‌ బాబు గురువారం వైఎస్సార్‌సీపీలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చేరారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండూరు అనిల్‌ బాబుతో పాటు బోగోలు, అల్లూరు, విడవలూరు, కోవూరు, నెల్లూరు మండలాలకు చెందిన మత్స్యకారులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కృషి చేస్తా : కొండూరు అనిల్‌ బాబు
కావలి నియోజకవర్గం బోగోలు మండలం పాతపాళెం గ్రామానికి చెందిన కొండూరు అనిల్‌  బాబు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని అన్ని మత్స్యకార గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కావలి, సర్వేపల్లి, నెల్లూరు నగర, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, నెల్లూరు కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.   

మత్స్యకారులకు అండగా ఉంటా : వైఎస్‌ జగన్‌
మత్స్యకారులు వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం వారినుద్దేశించి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. మత్స్యకారుల విషయంలో తాను ఎంత కమిట్‌మెంట్‌తో ఉన్నానో ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటిస్తున్న అంశాలను గమనిస్తేనే తెలుస్తోందన్నారు. పార్టీ నాయకులు, మత్స్యకారులు తనను కలిసినప్పుడు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసి ప్రకటిస్తున్న హామీలని పేర్నొన్నారు. మత్స్యకారులు చాలా విషయాలు తనకు చెబుతున్నారని, వారు చెప్పే మాటలు వింటుంటే  జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని నాకు తెలిసిందన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. మత్స్యకారుల పిల్లలు చదువులపై శ్రద్ధ చూపేలా, అందుకు అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చేయాల్సిన అవరం ఉందన్నారు.  మత్స్యకారులకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదన్నారు. మత్స్యకారులు చంద్రబాబు మాయలో పడి ఇక మోసం పోవద్దన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top